అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో,,,అమెరికా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అగ్రరాజ్య అధ్యక్ష పీఠాన్నిఎవరు కైవసం చేసుకుంటారోననే ఓవైపు తీవ్రచర్చ జరుగుతుండగానే,,మరోవైపు ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఓ పిడుగులాంటి వార్తను వెలువరించింది. అమెరికా ఓటర్లను భయాందోళనలో ముంచేత్తింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజున ఉగ్రదాడి జరుపుతామని ముస్లింలు ఎవరూ ఓటు హక్కు వినియోగించుకోకూడదంటూ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) హెచ్చరించింది. అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు వేరైనా.. వారు ముస్లింలకు వ్యతిరేకంగానే ఉన్నారని అలాంటి వారికి ఓట్లు వేయాల్సిన అవసరంలేదంటూ ఐసిస్ హెచ్చరించినట్లు ‘సైట్’ ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ రిటా కాట్జ్ ట్విట్టర్‌లో తెలిపారు.
‘అమెరికా చరిత్రలోనే చూడనంత ఘోరంగా అధ్యక్ష ఎన్నికల్లో దాడి జరిగేలా దేవుడు చూడాలి’ అంటూ ‘ద ముర్తాద్ ఓటు’ పేరుతో ఎన్నికలకు వ్యతిరేకంగా ఐసిస్ రాసిన వ్యాఖ్యలను అల్‌హయత్ మీడియా విడుదల చేసింది. ముస్లింగా పుట్టి తర్వాత ఇస్లాం మతం నుంచితప్పుకొనేవారిని ముర్తాద్ అంటారు. ఉగ్రదాడి హెచ్చరికలు రావడంతో అమెరికా అప్రమత్తమైంది. భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికా ప్రభుత్వం ఎన్నికలకు ఎంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నా,,,తాజాగా ఐసిస్ వెలరించిన హెచ్చరికతో అమెరికా ఓటర్లలో గుబులుపుట్టిస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రాణాలు చేతిలో పెట్టుకున్నారు.