ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఈ ప్రకటన చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చవిచూశారు పవన్. దాంతో ఈసారి ఎన్నికల్లో ఆయన తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా పార్టీ స్థాపించి పదేళ్ళు గడిచిన ప్రజా మద్దతు కూడగట్టుకోవడంలో పవన్ కొంత వెనుకంజలోనే ఉన్నారు. దాంతో ఈసారి కేవలం ఆయన గెలవడంతో పాటు పార్టీని కూడా గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆయన గెలవడం పార్టీకి చాలా కీలకం. ఎందుకంటే భారీ అభిమాన ఘనం ఉండి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పటికి గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓటమిపాలు అయ్యారు.
అందువల్ల ఈసారి ఏ మాత్రం ఓడిపోయిన పవన్ పొలిటికల్ కెరియర్ భారీగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే తాను పోటీ చేసే సీటు విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ చివరికి పిఠాపురం సీటు ఎంచుకున్నారు. ఇక్కడ అధికంగా ఉన్న కాపు ఓటు బ్యాంకు తనకు కలిసొస్తుందనే భావనతో పవన్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ పవన్ కు ధీటుగా వైసీపీ అభ్యర్థి ఎవరు నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మరోసారి పవన్ ఓడించాలని వైఎస్ జగన్ గట్టి పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి పవన్ కు ధీటైన అభ్యర్థిని బరిలో నిలిపి ఓడించాలనేది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది.
ప్రస్తుతం పిఠాపురం వైసీపీ ఇన్ చార్జ్ గా వంగా గీత ఉన్నారు. మరి ఈమెకే సీటు కేటాయిస్తారా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే పవన్ ను ఢీ కొట్టి నిలిచే సమర్థం ఆమెకు లేదనే మాట వైసీపీలోనే వినిపిస్తోంది. ఇకపోతే కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ వైసీపీలో చేరడంతో పిఠాపురం నుంచి పవన్ కు పోటీగా ఆయనను బరిలో నిలిపే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కాపు ఓటర్లే లక్ష్యంగా పవన్ పిఠాపురం ఎంచుకోగా.. అదే కాపు ఓటర్లను ప్రభావితం చేసే ముద్రగడను బరిలో దించితే పవన్ ను ఓడించడం సులువౌతుందనేది వైసీపీ నేతల అభిప్రాయం. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ఉన్న పవన్ వైసీపీ అభ్యర్థిని ఓడించి విజయఢంఖా మోగించడం సవాలే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read:పిక్ టాక్ : ఘాటు ఫోజులతో రచ్చ రచ్చ