ఇందూరులో ధర్మపురికి షాకేనా!

13
- Advertisement -

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఇక ఉత్తర తెలంగాణలో కీలక నియోజకవర్గం నిజామాబాద్. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ప్రస్తుతం బీఆర్ఎస్‌కు బలమైన కేడర్ ఉంది. అయితే గత ఎన్నికల్లో తొలిసారి బీజేపీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందారు.

ఈసారి కూడా బీజేపీ నుండి ధర్మపురి అరవింద్ బరిలో నిలవగా కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్‌ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిన వారే.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు బీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీ చెరో రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నియోజవర్గాల వారీగా ఓట్లను అంచనా వేస్తు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. జీవన్‌ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా, బాజిరెడ్డి నాలుగు సార్లు గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో తానే గెలుస్తానని చెబుతున్నారు జీవన్ రెడ్డి. తనను గెలిపిస్తే చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని తేల్చిచెబుతున్నారు.

గులాబీ పార్టీ ఓటు బ్యాంకే తనను గెలిపిస్తుందని చెబుతున్నారు బాజిరెడ్డి. ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నుండి ఎమ్మెల్యేగా పనిచేయడంతో ఆ పరిచయాలు కూడా తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి పూర్తిగా ప్రధాని మోడీ చరిష్మాపై ఆధారపడ్డారు. అయితే ధర్మపురిపై ప్రజల్లో అసంతృప్తి ఉండటంతో ఇది ఏమేరకు కలిసివస్తుందో వేచిచూడాలి. ముఖ్యంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని నాన్చుతూ నాన్చుతూ వచ్చిన అరవింద్…తీరా ఎన్నికలకు ముందు ప్రకటన చేసిన అది పెద్దగా ప్రభావం చూపదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.మొత్తంగా ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండగా గెలుపు ఎవరిని వరిస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -