పూరి మళ్లీ హిట్ కొట్టేనా?

251
jagan
- Advertisement -

కమర్షియల్ సినిమాకి త‌న‌దైన మార్క్‌, మీనింగ్ ఇచ్చిన ఏకైక దర్శకుడు పూరి జ‌గ‌న్నాథ్‌. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ..తనదైన డైలాగ్‌లతో మాస్‌ ప్రేక్షకులను కట్టిపడేయగల నేర్పరి. హీరో ఎవరైన వేగంగా సినిమాలు పూర్తి చేస్తూ స్పీడ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. సంఘంలో అరాచ‌కాల్ని ప్ర‌శ్నిస్తూ.. పూరి సినిమాల్లో క‌థానాయ‌కుడు వేసే ప్ర‌తి పంచ్ డైలాగ్‌ హైలెవ‌ల్‌ని ట‌చ్ చేస్తుంది. క్లాస్‌- మాస్ అనే తేడా లేకుండా త‌న‌దైన శైలి డైలాగుల‌తో మెప్పించిన ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. అయితే ఇదంతా గతం.

ప్రస్తుతం పూరి తీవ్ర కష్టాల్లో ఉన్నారు. తన దగ్గర ఉన్నది అంతా పెట్టి తీసిన లైగర్ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమాతో తన నెక్ట్స్ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడటమే కాదు డిస్ట్రిబ్యూటర్స్‌ దగ్గరి నుండి ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు డిస్ట్రిబ్యూటర్లపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుచేయడమే కాదు వారి నుండి ప్రాణహాని ఉందని తెలపగా పోలీసులు రక్షణ కూడా కల్పించారు.

అయితే తాజాగా ఈడీ రూపంలో పూరిపై మరో బాంబ్ పడింది. లైగర్‌ సినిమా పెట్టుబడుల విషయంలో ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారని భారీగా విదేశాల నుండి డబ్బులు వచ్చాయని నోటీసులు అందుకున్నారు. దీంతో విచారణకు హాజరుకాగా పూరి ఉక్కిరిబిక్కిరి అయినట్లు సమాచారం. ఇక గతంలో డ్రగ్స్ కేసులోనూ పూరి విచారణకు హాజరయ్యారు. ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది.

వాస్తవానికి పూరికి కష్టాలు కొత్తేమీ కాదు. ఒకప్పుడు హిట్ సినిమాలను అందించి భారీగా ఆస్తులు కూడబెట్టిన పూరి తన మేనేజర్ చేసిన మోసంతో రోడ్డున పడాల్సివచ్చింది. ఉన్న ఆస్తులను కూడా అమ్ముకున్నారు. అయితే తర్వాత ఏమాత్రం ధైర్యాన్ని కొల్పోకుండా మళ్లీ కమ్‌బ్యాక్ అయ్యారు. పూరి పడిన కష్టాన్ని చూసి ఆయన ధైర్యాన్ని కొనియాడని వారుండరూ. తాజాగా మళ్లీ పూరికి లైగర్ రూపంలో అలాంటి కష్టాలే రావడంతో ఆయన అన్ని అవరోధాలను దాటుకుని పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్‌.

ఇవి కూడా చదవండి..

- Advertisement -