ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం ఎంతటి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొత్తులైనా, ఇచ్చే హామీలైనా పార్టీకి లాభం చేకూరే విధంగానే ప్రణాళికలు రచిస్తారు కాషాయ పెద్దలు. అందులో భాగంగానే ప్రత్యర్థి పార్టీ నేతలపై ఘాటైన విమర్శలు గుప్పించడం, లేదా వారిని ఇబ్బంది పెట్టేలా వివిధ కేసులను బయటకు తీయడం తద్వారా వాటినే నొక్కి చెబుతూ ప్రజలను తమవైపు తిప్పుకోవడం ఇవే ఎన్నికల వేళ బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు. అయితే ఇలా కాకుండా మోడీ సర్కార్ చేసిన అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్లగలరా ? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ ఏడాది తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ రాష్ట్రాల్లో సత్తా చాటాలని కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. మరి ముఖ్యంగా రాజస్తాన్, తెలంగాణ రాష్ట్రాలలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కలలు కంటున్నారు బీజేపీ పెద్దలు. అందుకే అటు రాజస్తాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఇటు తెలంగాణలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారే తప్ప.. అధికారంలోకి వస్తే ఇంతవరకు మోడీ సర్కార్ చేసిన అభివృద్దిని గాని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై గాని అసలు స్పందించడం లేదు.. ఈ నేపథ్యంలో రాజస్తాన్ సిఎం అశోక్ గెహ్లాట్ మోడీ అమిత్ షా లకు సవాల్ విసిరారు. ” మోడీ, అమిత్ షా ప్రజలను రెచ్చేగొట్టే మాటలు మాని, ఎక్కడికి వెళ్ళిన వారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడగలరా ? వారికి ఆ దమ్ముందా ? ” అంటూ ప్రశ్నించారు. నిజానికి ఇప్పటివరకు మోడీ గాని, అమిత్ షా గాని ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థి పార్టీ నేతలపై విమర్శలు గుప్పించడమే మొదటి లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరి ఇక ముందైన విమర్శలు మాని, అభివృద్ది నినాదంగా ప్రజల్లోకి వెలతారేమో చూడాలి.
Also Read:బండి సంజయ్ తిరుగుబాటు.. బీజేపీలో భయం!