త్వరలో కేరళ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మార్చేందుకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టగా, రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. మలయాళ భాషలో ఉన్న పేరునే అన్ని భాషల్లో అధికారికంగా గుర్తించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఈ పరిణామం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
కేరళ శాసనసభ మొదటిసారి పేరు మార్పు తీర్మానాన్ని ఆమోదించింది. అయితే స్పష్టత, సాంకేతిక సవరణలు అవసరమని కేంద్ర హోంశాఖ సూచించడంతో అది తిరిగి పంపబడింది.ఆ తర్వాత సవరణలతో కూడిన తీర్మానాన్ని 2024 జూన్ 25న మళ్లీ శాసనసభ ఆమోదించింది. “Kerala”కి బదులుగా మలయాళ రూపమైన “Keralam”నే అధికారికంగా ఉపయోగించాలని హౌస్ మళ్లీ కోరింది.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ, “కేరళం” అనే పేరు రాష్ట్ర భాషా గుర్తింపును, చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. స్వాతంత్ర్య సమర కాలంలో ఉద్భవించిన ఏకైక మలయాళ భాషాభిమాన రాష్ట్ర ఆలోచనకు ఇది ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.
ఒక రాష్ట్ర పేరును మార్చాలంటే కేంద్ర కేబినెట్ ఆమోదం అవసరం. అనంతరం కేంద్ర స్థాయిలో అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తవ్వాలి. ఆమోదం లభిస్తే, కేంద్ర రికార్డులు మరియు అధికారిక పత్రాలలో “Keralam” అనే పేరు ఉపయోగించబడుతుంది.
Also Read:TG:తెలంగాణ రెయిన్ అలెర్ట్!

