జనసేనతో పొత్తు.. ఉన్నట్లా ? లేనట్లా ?

24
- Advertisement -

ఏపీ రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడం, టీడీపీతో పొత్తును పవన్ కన్ఫర్మ్ చేయడం.. అదే టైమ్ లో బిజెపి ప్రస్తావన లేకపోవడం.. వంటి అంశాలను పరిశీలిస్తే ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో విశ్లేషకుల అంచనాలకు కూడా అందడం లేదు. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు కన్ఫర్మ్ చేయడంతో బీజేపీ పరిస్థితి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. కాగా బీజేపీ మాత్రం జనసేనతో పొత్తు ఉంటుందని చెబుతూనే టీడీపీతో కలవడంపై మాత్రం నోరు మెదపడంలేదు. .

దీంతో బీజేపీ ఏటూ తేల్చుకోలేని డైలమాలోకి వెళ్లిపోయింది. నిన్న మొన్నటి వరకు పవన్ మావాడని గట్టిగా చెబుతూ వచ్చిన కమలం పార్టీ నేతలు.. టీడీపీతో పొత్తు ప్రకటించిన తరువాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఎందుకంటే టీడీపీతో కలవడానికి కాషాయ పార్టీ మొదటి నుంచి కూడా ససేమిరా అంటూ వస్తోంది. దాంతో ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ పక్షాన చేరడంతో.. బీజేపీ జనసేనతో తెగతెంపులు చేసుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

కాగా పవన్ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో బీజేపీతో కూడా తమ పొత్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. దీంతో ఊపిరి పిల్చుకున్న కమలనాథులు మళ్ళీ జనసేనతో పొత్తును కన్ఫర్మ్ చేశారు. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మాట్లాడుతూ జెఎస్పి తో తమ పార్టీ పొత్తు కొనసాగుతుందని, టీడీపీతో మాత్రం పొత్తు ఉంటుందా లేదా అనేది అధినాయకత్వమే డిసైడ్ చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇక త్వరలోనే టీడీపీతో పొత్తు పెట్టుకున్న అంశాన్ని బీజేపీ పెద్దలకు వివరించేందుకు పవన్ సిద్దమౌతున్నారు. మరి కాషాయ పార్టీ పెద్దలు పవన్ వినతి మేరకు కూటమికి రెడీ అవుతారా ? లేదా జనసేనతోనే పొత్తు తెగతెంపులు చేసుకొని ఒంటరిగా బరిలోకి దిగుతారా అనేది చూడాలి.

Also Read:అతిథి..ఎంటర్‌టైన్ పక్కా

- Advertisement -