పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్ మొదటిసారిగా శక్తివంతమైన సెజ్జిల్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు సమాచారం. ఈ క్షిపణి ప్రయోగం ప్రాంతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. సెజ్జిల్ మిస్సైల్ అనేది ఇరాన్ స్వదేశీయంగా రూపకల్పన చేసి అభివృద్ధి చేసిన ఆధునిక బాలిస్టిక్ క్షిపణి. ఇది ఘన ఇంధనంతో పనిచేసే రెండు దశల (టూ-స్టేజ్) క్షిపణిగా గుర్తింపు పొందింది.
సెజ్జిల్ క్షిపణి సుమారు 700 కిలోల పేలోడ్‌ను మోయగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ క్షిపణి దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ఖచ్చితంగా తాకగలదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అధిక ఎత్తులో వేగంగా విన్యాసాలు చేయగల ప్రత్యేక సామర్థ్యం ఈ క్షిపణికి ఉండటంతో దీనిని “డ్యాన్సింగ్ క్షిపణి” అని కూడా పిలుస్తారు.
అమెరికాకు చెందిన ప్రముఖ వ్యూహాత్మక పరిశోధనా సంస్థ Center for Strategic and International Studies (CSIS) వివరాల ప్రకారం, సెజ్జిల్-2 క్షిపణి సుమారు 18 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. దీని వ్యాసం దాదాపు 1.25 మీటర్లు కాగా, మొత్తం బరువు సుమారు 23,600 కిలోలుగా ఉంటుంది.
Also Read:ఘనంగా కుల్దీప్ యాదవ్ వివాహాం
ఘన ఇంధనంతో పనిచేయడం వల్ల ఈ క్షిపణిని త్వరగా ప్రయోగించే సామర్థ్యం ఉంటుంది. దీనివల్ల ప్రత్యర్థి దేశాలకు ముందస్తు హెచ్చరిక ఇవ్వడానికి సమయం తక్కువగా ఉంటుంది. ఈ క్షిపణి ప్రయోగంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

