భారత్‌పై ట్రంప్ కామెంట్స్..ఇరాన్‌ కౌంటర్

7
- Advertisement -

భారత్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ అనూహ్యంగా స్పందిస్తూ, ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చింది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ మరియు పౌరసత్వ చట్టాలపై జరిగిన చర్చా కార్యక్రమంలో మైఖేల్ సేవేజ్ అనే వ్యాఖ్యాత మాట్లాడుతూ, భారత్ మరియు చైనా వంటి దేశాలను ‘హెల్ హోల్స్’ అని అభివర్ణించారు. ఈ వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో రీషేర్ చేయడంతో భారతీయుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది.

దీనిని తీవ్రంగా పరిగణించిన ముంబైలోని ఇరాన్ కాన్సులేట్, మహారాష్ట్ర అభివృద్ధిని, సంస్కృతిని ప్రతిబింబించే ఒక వీడియోను ‘X’లో పోస్ట్ చేసింది. మహారాష్ట్రలోని ఆధునిక భవనాలు, గణేశోత్సవ సంబరాలు, పచ్చని కొండలు, జలపాతాలు మరియు తీరప్రాంతాల అందాలను అందులో చూపించారు.

బహుశా మిస్టర్ ట్రంప్‌కు ఒక వన్-వే కల్చరల్ డిటాక్స్ బుక్ చేయాలి, అది ఆయన చేసే అనవసర ‘బక్వాస్’ (పిచ్చి మాటలు)ను తగ్గిస్తుంది. ఎప్పుడైనా ఇండియాకు వచ్చి చూసి, ఆ తర్వాత మాట్లాడండి అని పేర్కొంటూ ట్రంప్‌పై విరుచుకుపడింది. ఈ దౌత్యపరమైన రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. ఇవి అనాలోచితమైనవి, అనుచితమైనవి మరియు చెత్త అభిరుచితో కూడినవి అని ఆయన పేర్కొన్నారు. భారత్-అమెరికా సంబంధాలు పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని, ఇటువంటి వ్యాఖ్యలు వాస్తవాలను ప్రతిబింబించవని ఆయన స్పష్టం చేశారు.

వివాదం ముదురుతున్న క్రమంలో ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. భారత్ ఒక గొప్ప దేశమని, భారత నాయకత్వం తనకు చాలా మంచి మిత్రులని ఆయన పేర్కొంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. శివసేన (UBT) నేత ప్రియాంక చతుర్వేది ఇరాన్ కాన్సులేట్ స్పందనను అభినందిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మొత్తానికి ఈ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Also Read:ప్రతిష్టాత్మకంగా భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్!

- Advertisement -