ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కోల్‌కతాలో జరుగుతుందని లీగ్ నిర్వాహకులు సోమవారం ప్రకటించారు. ఈనెల 19 (గురువారం)న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం షెడ్యూల్ ప్రకారం కోల్‌కతాలోనే జరుగుతుందని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి కూడా తెలిపారు.
అయితే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బంగ్లాదేశ్‌కు సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. కొన్ని చోట్ల నిరసనలు హింసాత్మకంగా ఉన్నాయి. ఐపీఎల్ వేలం ఆ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో నిర్వహించనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యాలు కలవరపడ్డాయి.
ఈ నేపథ్యంలో కోల్‌కతాలో నెలకొన్న పరిస్థితులపై బీసీసీఐ అధికారి మీడియాతో మాట్లాడాడు. షెడ్యూల్ అనుసరించి గురువారం వేలంపాట జరుగుతుంది. పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా.. కోల్‌కతాలో అంతగా ప్రభావం కనిపించడం లేదని. ఢిల్లీ యాజమాన్యం మంగళవారమే ఇక్కడకు చేరుకోనుంది. మిగతా ఫ్రాంచైజీలు బుధవారం ఉదయం వరకు చేరుకోవచ్చు అని తెలిపారు.