ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).ఐపీఎల్ పదో సీజన్ కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న బెంగళూరులో ఆటగాళ్ల వేలంపాట జరుగనుంది. అయితే వచ్చే సీజన్‌లో స్టార్ ఆటగాళ్లను వదులుకునేందుకు ప్రాంఛైజీలన్నీ సిద్ధమయ్యాయి. దాదాపుగా ఫ్రాంచైజీలన్నీ 40 మందికి పైగా ఆటగాళ్లను వదులుకుంటున్నట్లు తెలుస్తోంది. జాబితాలో ఇయాన్ మోర్గాన్, కెవిన్ పీటర్సన్, డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్, జాసన్ హోల్డర్, మిచెల్ జాన్సన్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు ఉండటం గమనార్హం.
ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్ట్‌ల సిరీస్ ముగిసిన వారం వ్యవధిలోనే ఏప్రిల్ 5న ఐపీఎల్ మొదలుకానుంది. 2008లో మొదలైన ఐపీఎల్ పదేండ్ల కాంట్రాక్టు కాలపరిమితిలో ఇదే ఆఖరి సీజన్. ఐపీఎల్-8 ఛాంపియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇయాన్ మోర్గాన్, ఆశిశ్ రెడ్డి, సుమన్‌తో పాటు పలువురిని వదులుకోనుంది. ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇదే బాటలో నడుస్తున్నాయి.
ఐపీఎల్-9 సీజన్‌లో ఏడో స్థానంలో నిలిచిన ధోని సారథ్యంలోని రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ దాదాపు 10 మందిని వదులుకోనుంది. పీటర్సన్, ఇషాంత్‌శర్మ, ఇర్ఫాన్ పఠాన్, స్పిన్నర్ మురుగన్ అశ్విన్‌ను విడిచిపెడుతోంది. గుజరాత్ లయన్స్ దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్‌ను, దిల్లీ డేర్‌డెవిల్స్ రూ.8.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్ పవన్ నేగిని, కోల్‌కతా నైట్‌రైడర్స్ జాసన్ హోల్డర్‌ను విడిచిపెడుతున్నాయి.
గత ఏడాది తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో గత సీజన్‌లో మహారాష్ట్రకు దూరమైన ఐపీఎల్ మ్యాచ్‌లను ఈసారి ముంబై, పుణె, నాగ్‌పూర్‌లలో నిర్వహించేందుకు కౌన్సిల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు పాకిస్థాన్ దిగ్గజ పేసర్, కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) బౌలింగ్ కోచ్, మెంటార్ వసీం అక్రమ్ రానున్న ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. బిజీ షెడ్యూల్ కారణంగా ఐపీఎల్-2017 సీజన్ నుంచి అక్రమ్ తప్పుకున్నట్లు కేకేఆర్ యాజమాన్యం తెలిపింది. కేకేఆర్ జట్టును మిస్సవుతున్నానని, జట్టులో అద్భుత ప్రతిభ కల్గిన ఆటగాళ్లకు కొదువలేదని అక్రమ్ తెలిపిన సంగతి తెలిసిందే.