ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్ సైట్ ప్రారంభం…

300
ktr
- Advertisement -

తెలంగాణలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ ఈ రోజు ప్రారంభమైంది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మంత్రులు జగదీశ్వర్ రెడ్డి కే తారకరామారావు సమక్షంలో ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ లాంచ్ చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రి హరీష్ రావు ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ ప్రారంభించారు.

తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ మరియు ఐటీ శాఖ మరియు ఇన్వెస్ట్ తెలంగాణ విభాగం కలిసి ఈ వెబ్సైట్ను రూపొందించింది.తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసం అవసరమైన సమాచారం అంతా ఈ వెబ్సైట్లో ఉంచినట్లు పరిశ్రమల శాఖ తెలిపింది. తెలంగాణ దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానం అని ముఖ్యంగా తెలంగాణలోని వివిధ రంగాల వారీగా ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అనే విషయానికి సంబంధించి సంపూర్ణ సమాచారం ఇచ్చినట్లు పరిశ్రమల శాఖ తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో వరుసగా అగ్రస్థానంలో నిలుస్తూ వస్తుందని ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు.పెట్టుబడుల ఆకర్షణలో ప్రమోషన్ విభాగానికి అత్యంత కీలకమైన ప్రాధాన్యత ఉంద న్న మంత్రి కేటీఆర్ ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ పెట్టుబడిదారులకు అవసరమైన సంపూర్ణ సమాచారాన్ని అందిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇతర రాష్ట్రాలతో స్నేహపూర్వక పోటీని కొనసాగిస్తూనే తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమ ప్రయత్నాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.ఇప్పటికే వెబ్ సైట్ లో పలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన లైవ్ లింక్ లను ఉంచడం జరిగిందని, తద్వారా ఆయా సేవలను పెట్టుబడిదారులు నేరుగా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఈ వెబ్సైట్ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాబోయే రోజుల్లో వెబ్సైట్లో అంతర్జాతీయ భాషల్లోనూ వెబ్ సైట్ ని తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

ఈ వెబ్సైట్ పైన ఎవరైనా మరింత సమాచారం లేదా ఫీడ్బ్యాక్ని అందించాలి అనుకుంటే invest-telangana@telangana.gov.in. పంపాలని పరిశ్రమల శాఖ సూచించింది. https://invest.telangana.gov.in/ లింక్ ద్వారా వెబ్ సైట్ ను సందర్శించవచ్చు అని తెలిపింది.

- Advertisement -