ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent Fasting)పై ఆరోగ్య ప్రయోజనాలపై ఇటీవల కాలంలో విస్తృత ప్రచారం జరిగింది. నిర్దిష్ట సమయాల్లో మాత్రమే తినడం, మెటబాలిజం మెరుగుదల వంటి హామీలతో ఇది ఎంతో ప్రజాదరణ పొందింది. అయితే తాజా అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. క్యాలరీల పరిమాణం ఒకేలా ఉంటే, భోజనం చేసే సమయం మారినంత మాత్రాన మెటబాలిక్ లేదా గుండె ఆరోగ్యంలో స్పష్టమైన మెరుగుదల కనిపించదని ఈ పరిశోధన వెల్లడించింది.
జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్ పోట్స్‌డామ్-రెహ్‌బ్రూక్ మరియు షారిటే యూనివర్సిటాట్స్‌మెడిజిన్ బెర్లిన్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. పరిశోధకులు టైమ్-రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ (TRE)పై దృష్టి సారించారు. ఇందులో రోజువారీ ఆహారం 8–10 గంటల విండోలో తీసుకుని, కనీసం 14 గంటలు ఉపవాసం ఉంటారు. ఇది బరువు నియంత్రణ, మెటబాలిక్ ఆరోగ్యం కోసం విస్తృతంగా పాటిస్తున్నారు. అయితే ఈ ప్రయోజనాలు భోజన సమయం వల్లా, లేక అనుకోకుండా తగ్గిన క్యాలరీల వల్లా అన్నదే ఈ అధ్యయన లక్ష్యం.
అధిక బరువు లేదా స్థూలకాయం ఉన్న 31 మంది మహిళలు ఇందులో పాల్గొనగా పాల్గొనేవారు రెండు వారాల చొప్పున రెండు భోజన విధానాలు పాటించారు. ఒకటి ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు (ఎర్లీ TRE), మరొకటి మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 వరకు (లేట్ TRE). రెండు దశల్లోనూ క్యాలరీలు, పోషక విలువలు ఒకేలా ఉంచారు.
రక్త నమూనాలు, గ్లూకోజ్ టోలరెన్స్ టెస్టులు, 24 గంటల షుగర్ మానిటరింగ్, శారీరక చురుకుదనం కొలవడం వంటి పలు పరీక్షలు నిర్వహించారు. క్యాలరీలను స్థిరంగా ఉంచడం ద్వారా ఒక ముఖ్యమైన అంశాన్ని తొలగించారు. మునుపటి అధ్యయనాల్లో కనిపించిన ప్రయోజనాలు భోజన సమయం వల్ల కాకుండా, అనుకోకుండా తగ్గిన క్యాలరీల వల్లే కావచ్చు నిపుణులు తెలిపారు. ఈ సర్వేలో భోజనం చేసే సమయం కన్నా శక్తి సమతుల్యత (ఎనర్జీ బ్యాలెన్స్) ఎక్కువ ప్రభావం చూపిందని తేలింది.
ఇన్సులిన్ సెన్సిటివిటీ, రక్తంలో చక్కెర స్థాయిలు, రక్త కొవ్వులు, ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లు—ఏ అంశంలోనూ ఎర్లీ, లేట్ భోజన విధానాల మధ్య గణనీయమైన తేడా కనిపించలేదు. భోజన సమయం ఏదైనా, కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం దాదాపు మారలేదని పరిశోధకులు గుర్తించారు.మెటబాలిజంలో మార్పులు లేకపోయినా, భోజన సమయం శరీర సర్కేడియన్ రిథమ్‌పై ప్రభావం చూపింది. ప్రొఫెసర్ ఆచిమ్ క్రామర్ అభివృద్ధి చేసిన ‘బాడీటైమ్’ పరీక్ష ద్వారా, ఆలస్యంగా భోజనం చేసే విధానం సుమారు 40 నిమిషాల మేరకు శరీర గడియారాన్ని మార్చిందని తేలింది.
Also Read:పంట కొనుగోలుకై ఆదిలాబాద్ బంద్

