జాతీయ పండుగగా మేడారం..

431
Errabelli Dayakar Rao
- Advertisement -

ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా మేడారం జాతరను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మేడారం జాతరకు దాదాపు కోటిన్నర వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని… దీనికి అనుగుణంగా జాతర ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఈ మేరకు వివరించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. 2020 ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనున్న మేడారం జాతరకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

మేడారం జాతరకు కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రితోపాటు అన్ని రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖల మంత్రులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. మనదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ గిరిజన సంఘాల ప్రతినిధులను అహ్వానిస్తామని చెప్పారు. మేడారం జాతర నిర్వహణకు అవసరమైన శాశ్వత ఏర్పాట్లు కల్పనకు తొలిదశలో రూ.10 కోట్లతో గద్దెల పరిసరాల్లో భూసేకరణ జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. జాతరను పూర్తిగా ఆదివాసీలు, అక్కడ పూజరుల సూచనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు మేడారం పూజారులు, గిరిజన సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపే బాధ్యతలను ములుగు జిల్లా కలెక్టర్‌కు, ఏటూరునాగారం ఐటీడీఏ పీవోకు అప్పగించారు.

Indrakaran Reddy

మేడారం జాతర–2020 ఏర్పాట్లపై మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌లు శుక్రవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్‌దత్‌ ఎక్కా, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, ములుగు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ ఈఎన్‌సీ సత్యనారాయణరెడ్డి, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక మేడారం జాతరను ఘనంగా నిర్వహించేలా శాశ్వత ప్రాదిపదికన ఏర్పాట్లు ఉండాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

‘మేడారం జాతరకు ప్రపంచంలోనే ప్రత్యేకత ఉంది. ఇది పూర్తిగా గిరిజన జాతర. మన రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ నుంచి భక్తులు ఈ జాతరకు వస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మేడారం ఇష్టమైన జాతర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు జాతరలను విజయవంతంగా నిర్వహించాం. భక్తులకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా వచ్చే జాతరకు ఏర్పాట్లు చేయాలి. ప్రతిసారి కొత్తగా పనులు చేపట్టడం కాకుండా శాశ్వత నిర్మాణాలు ఉండాలని గత జాతరకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. మేడారం గద్దెలు, జాతర పరిసరాల్లో శాశ్వత నిర్మాణాల కోసం అవసరమైన భూములను సేకరించాలని సూచించారు. దీనికి అనుగుణంగా దశల వారీగా శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. గద్దెల పరిసరాలలో భక్తుల వసతులకు, ఆర్టీసీ సేవలకు, పోలీసు సిబ్బందికి అవసరమైన శాశ్వత నిర్మాణాలు ఉండాలి.

దీని కోసం తొలిదశలో రూ.10 కోట్లతో భూసేకరణ జరిపేందుకు ప్రణాళిక రూపొందించాలి. వచ్చే ఏడాది జాతరకు 1.40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. అన్ని శాఖలు, ముఖ్యంగా పోలీసు శాఖతో సమన్వయంతో జాతరకు వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలి. గద్దెల పరిసరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. క్యూలైన్ల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. జాతరలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా కీలకం. దీనికి కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరగాలి. మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలి. జాతరకు కావాల్సిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను తయారు చేయాలి. వచ్చే నెలలో మరోసారి సమావేశంపై ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సమర్పిద్దాం. గత జాతర అనుభవాలతో వచ్చే జాతరకు ఏర్పాట్లు ఉండాలి.

గత జాతరలో విధులు నిర్వహించిన అధికారుల సేవలను వినియోగించుకోవాలి. మేడారం వన జాతర. అటవీ సంపదకు నష్టం జరగకుండా జాతర నిర్వహించాలి. కాలుష్య నియంత్రణపై సీరియస్‌గా ఉండాలి. ప్లాస్టిక్‌ రహిత జాతర కోసం ప్రజలకు, భక్తులకు అవగాహన కల్పించాలి. మేడారం జాతర పూర్తిగా గిరిజన ఉత్సవం. మేడారం పూజారులు, ఆదివాసీల మనోభావాలు, సంప్రదాయాల ప్రకారం జాతరను నిర్వహించాలి. జాతర ఏర్పాట్లలో వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉండాలి. మేడారం జాతర కమిటీని వెంటనే ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. మేడారం జాతరకు అనుబంధంగా జరిగే జాతరల నిర్వహణకు ప్రభుత్వ ఏర్పాట్లు చేయాలి. మూడు దశాబ్దాలుగా మేడారంతోపాటు జరిగే అనుబంధ జాతరలను ఎంపిక చేసి వాటికి ప్రభుత్వ పరంగా సహకారం అందించాలి. మేడారం జాతర గొప్పదనాన్ని అందరికీ తెలియజేసేలా హైదరాబాద్, వరంగల్‌ నగరాల్లో డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయాలి. వచ్చే నెలలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించుకుందాం. ఆలోపు పూర్తి స్థాయి ప్రణాళిను వెంటనే సిద్ధం చేయాలి’అని అధికారులను మంత్రులు ఆదేశించారు.

- Advertisement -