ఇండోనేషియాలో విషాదం చోటుచేసుకుంది. సులవెసి ద్వీపంలో భారీ భూకంపం ప్రభావంతో 384 మంది మృతి చెందారు. భూకంపానికి సునామీ తోడవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం ధాటికి ఇండోనేషియా అతలాకుతలం అయింది. రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. వేలసంఖ్యలో భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద
వందల సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారు.
ఒక్క పాలూ నగరంలో వందల మందికి పైగా మృతి చెందగా వేల సంఖ్యలో గాయడపడ్డారని అధికారులు తెలిపారు. సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో పూర్తి వివరాలు పొందలేకపోయామని చెప్పారు. చాలా మృతదేహాలను సులవేసి సముద్రతీరంలో గుర్తించినట్లు చెప్పారు. గాయపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సునామీ ధాటికి తీర ప్రాంతంలోని ఇళ్లు, కట్టడాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.