ఇస్రో చరిత్రాత్మక విజయం – ప్రపంచ రికార్డు

213
- Advertisement -

అంతరిక్ష ప్రయోగంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతునే ఉంది.  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)లో మరో చరిత్రాత్మక విజయాన్ని సాధించింది.   నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ సెంటర్‌(షార్‌) నుంచి ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో అంతరిక్ష ప్రయోగంలో అగ్రదేశాల సరసన చేరిన భారత్  ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రయోగం విజయవంతం కావటంతో శాస్త్రవేత్తలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరి కృషితోనే ఇది సాధ్యమైందని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.

ఉదయం 9.28 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ సీ-37 గగనతలంలోకి ప్రయాణం మొదలు పెట్టింది. మొత్తం నాలుగు దశల్లో ప్రయోగం పూర్తవుతుంది. ఈ ప్రయోగం ద్వారా మూడు స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు. మొత్తం 524 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యావర్తన కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. 28.42 నిమిషాల్లో రాకెట్‌ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది.

ప్రయోగం ప్రారంభమైన తర్వాత 17.29 నిమిషాలకు కార్టోశాట్‌-2.. రాకెట్‌ నుంచి 510.383 కిలోమీటర్ల ఎత్తులో విడిపోగా  ఐఎన్‌ఎస్‌-1ఏ 17.29 నిమిషాలకు, ఐఎన్‌ఎస్‌-1బి 17.40 నిమిషాలకు వాహక నౌక నుంచి విడిపోయాయి. దీని తర్వాత 18.32 నిమిషాల నుంచి 28.42 నిమిషాల మధ్య విదేశీ ఉపగ్రహాలన్నీ 524 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్‌ నుంచి విడిపోయాయి.

ISRO launch PSLV c37

714 కిలోల బరువైన కార్టోశాట్‌ 2డీ, ఇస్రో నానో శాటిలైట్స్‌ అయిన ఐఎన్ ఎస్‌–1ఏ, ఐఎన్ ఎస్‌–1బీలు స్వదేశీ ఉపగ్రహాలు. విదేశీ ఉపగ్రహాల్లో 96 అమెరికాకు చెందినవి కాగా, ఇజ్రాయెల్, కజకిస్తాన్ , నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఏఈ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం కూడా ఈ ప్రయోగంలో పాలుపంచుకుంటున్నాయి. కార్టొశాట్‌ 2డీ ఉపగ్రహం రిమోట్‌ సెన్సింగ్‌ సేవలను ఐదేళ్ల పాటు అందిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను పంపిన తొలిదేశంగా భారత్‌ చరిత్ర సృష్టిస్తుంది. గతంలో రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకే రాకెట్‌తో 37 ఉపగ్రహాలను విజయవంతంగా పంపించింది.

జూన్ 2015లో ఇస్రో సైతం ఒకే ప్రయోగంలో 23 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మంగళవారం ఉదయం కౌంట్‌డౌన్  ప్రారంభమైన వెంటనే రాకెట్‌కు నాలుగో దశలో అవసరమైన 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.

- Advertisement -