ఇండియన్ రైల్వేలు దూర ప్రయాణాల్లో కొత్త యుగానికి నాంది పలకనున్నాయి. తేజస్ వంటి వేగం, రాజధాని తరహా సౌలభ్యం, వందే భారత్ సాంకేతికత — ఈ మూడు లక్షణాలు ఇప్పుడు ఒకే రైలులో కలవనున్నాయి. ఢిల్లీ–పట్నా రూట్‌పై దేశంలోని తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ త్వరలో పరుగులు తీయనుంది.
రాత్రిపూట ప్రయాణాల్లో వచ్చే అలసట ఇక గతం కానుంది. ఈ నెల చివరి నాటికి పట్నా–ఢిల్లీ మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ చారిత్రాత్మక ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు రైల్వేలు పూర్తిచేసే దశలో ఉండగా, ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బెంగళూరులోని BEML (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) ఈ ట్రైన్‌ను తయారు చేస్తోంది. డిసెంబర్ 12న ఉత్తర రైల్వేకు పంపనుండగా అనంతరం ఢిల్లీ–పట్నా రూట్‌పై ట్రయల్ రన్ నిర్వహించబడుతుంది. మొత్తం 16 కోచ్‌లతో రూపొందించిన ఈ ఆధునిక రైలులో 827 బెర్తులు ఉండనున్నాయి. వీటిలో 611 థర్డ్ AC, 188 సెకండ్ AC, 24 ఫస్ట్ AC బెర్తులు.
వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ఆధునిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని రూపకల్పన చేశారు. ఆటోమేటిక్ డోర్లు, బయోటాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, అధిక నాణ్యత గల ఇంటీరియర్స్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. గరిష్టంగా 160 కి.మీ వేగంతో పరుగులు తీయగలిగే ఈ రైలు ‘కవచ్’ భద్రతా వ్యవస్థ, క్రాష్ రిసిస్టెంట్ నిర్మాణం వంటి అత్యాధునిక సాంకేతికతలతో రూపొందించబడింది. అవసరమైతే కోచ్‌ల సంఖ్యను 24కు పెంచవచ్చు.
ఈ రైలును న్యూ ఢిల్లీ–రాజేంద్ర నగర్ తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ తరహాలో నడపాలని ప్రణాళిక. వారానికి ఆరు రోజులు రైలు నడిచే అవకాశం ఉంది. పట్నాలోని రాజేంద్ర నగర్ టెర్మినల్ నుండి సాయంత్రం బయలుదేరే ఈ రైలు, మరుసటి రోజు ఉదయం ఢిల్లీలో చేరుతుంది. తిరుగు ప్రయాణం కూడా తేజస్ రాజధాని షెడ్యూల్‌ను పోలి ఉండనుంది.
Also Read:రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్:హరీష్

