బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన సౌరవ్ గంగూలీ భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు టెస్టు మ్యాచ్‌ను పగటి పూట మాత్రమే చూశాం..కానీ ఇకపై రాత్రి వేళలో కూడా టెస్టు మ్యాచ్‌ను చూడవచ్చు. భారత్‌లో తొలి డే నైట్ టెస్టుకు లైన్ క్లియర్ అయింది. బీసీసీ,బంగ్లా క్రికెట్ బోర్డు ఓకే చెప్పడంతో నవంబర్‌లో తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. దాదా ప్రాతినిధ్యం వహిస్తున్న కోల్‌కతాలోని విఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానం ఈ మ్యాచ్ కు వేదిక కానుండటం విశేషం.
అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే కోహ్లిని పింక్‌బాల్ క్రికెట్‌కు ఒప్పించిన గంగూలీ బీసీబీతో సంప్రదింపులు జరిపి డే నైట్ టెస్టు జరిగేలా చూడటంలో సక్సెస్ అయ్యాడు. నవంబర్ 22 నుంచి 26 వరకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కోల్‌కతాలో జరిగే రెండో టెస్టును ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్‌బాల్‌తో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. బీసీబీ పింక్‌బాల్ టెస్టుకు అంగీకరించింది. ఇది సానుకూల పరిణామం. టెస్టు క్రికెట్‌కు అవసరమైన మార్పు ఇది. కెప్టెన్ కోహ్లికి కూడా థ్యాంక్స్ అని గంగూలీ అన్నాడు.
వాస్తవానికి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ఎప్పుడో డే నైట్ టెస్టులు ఆడేశాయి. కానీ టెస్టుల్లో నంబర్ వన్ జట్టు భారత్ మాత్రం ఇప్పటిదాకా ఫ్లడ్‌లైట్ల మధ్య ఐదు రోజుల ఆట ఆడలేదు. గంగూలీ సంకల్పం వల్లే డే నైట్ టెస్టు సాకారమవుతోంది.