కెనడాలో భారతీయ విద్యార్థి హత్య

5
- Advertisement -

కెనడాలోని టొరంటో యూనివర్సిటీ స్కార్బరో క్యాంపస్ సమీపంలో భారతీయ విద్యార్థి శివాంక్ అవస్థి (20) కాల్పుల్లో మృతి చెందాడు. మంగళవారం రోజున హైల్యాండ్ క్రీక్ ట్రెయిల్, ఓల్డ్ కింగ్‌స్టన్ రోడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సరికి తుపాకీ గాయంతో తీవ్రంగా గాయపడిన శివాంక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రకటించారు. నిందితులు పోలీసుల రాకకు ముందే అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో టొరంటోలో ఈ ఏడాది నమోదైన 41వ హత్యగా ఇది మారింది.

టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టొరంటో యూనివర్సిటీ స్కార్బరో క్యాంపస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ డాక్టరల్ విద్యార్థి శివాంక్ అవస్థి మృతి చెందడం ఎంతో విషాదకరం. ఈ క్లిష్ట సమయంలో మృతుని కుటుంబంతో మేము సంప్రదింపులో ఉన్నాం. స్థానిక అధికారులతో కలిసి అవసరమైన అన్ని సహాయాలు అందిస్తున్నాం అని కాన్సులేట్ ఎక్స్ (X) వేదికగా తెలిపింది.

ఈ ఘటన అనంతరం భద్రతా చర్యల్లో భాగంగా క్యాంపస్‌ను తాత్కాలికంగా లాక్‌డౌన్ చేశారు. యూనివర్సిటీ విద్యార్థుల్లో భయం, ఆగ్రహం వ్యక్తమవుతోంది. రెడిట్‌లో ఒక విద్యార్థి చేసిన పోస్టులో, శివాంక్ మూడో సంవత్సరం లైఫ్ సైన్సెస్ విద్యార్థి అని, పగటి పూటే క్యాంపస్‌లోని లోయ ప్రాంతంలో కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. అక్కడ తగిన వెలుతురు, సీసీటీవీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు లేవని విద్యార్థులు విమర్శించారు.

Also Read:Rewind 2025:ఈ ఏడాది చనిపోయిన ప్రముఖులు వీరే!

- Advertisement -