పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై గురువారం ఆయన తమ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. ఉద్రిక్తతలు తగ్గించడానికి తాము ఈ పని చేస్తున్నామని, దీనిని బలహీనతగా చూడొద్దని పాక్ ప్రధాని ఇమ్రాన్ చెప్పారు.
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా దాడి జరిగిన 30 నిమిషాల్లోనే మమ్మల్ని నిందించడం మొదలుపెట్టారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై ఆధారాలు సమర్పించాలని తాము చర్యలు తీసుకుంటామని భారత్‌కు చెప్పానని ఆయన గుర్తు చేశారు. పాకిస్థాన్ భూభాగంలో భారత్ దాడి చేసింది. ఆ తర్వాత రెండు రోజులకి పాక్‌కు భారత్ వివరణపత్రం అందజేసింది. ఈ పని ఇంతకు ముందే ఎందుకు చేయలేదు?’ అని ఆయన ప్రశ్నించారు. శాంతిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇండియన్ పైలట్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయాలని నిర్ణయించాం అని ఇమ్రాన్ స్పష్టం చేశారు.