అవగాహన, విజ్ఞానం, వర్తమాన విషయాల నుంచి అంతర్జాతీయ సంగతుల వరకూ పూర్తి సమాచారం, అటెన్షన్ టు డీటైల్, అర్థం అయ్యిందా లేదా అనే ప్రశ్నే రాకుండా అవతలివారికి పండువలిచి చేతిలోపెట్టినంతగా వివరించడంలో నైపుణ్యం, అమేయమైన భాష, మాటలు సూటిగా వస్తున్నా మాటలమధ్య ఎంపతీ తప్పని నాయకత్వం, ఏది తెలియపరచాలో దాన్ని నిజాయితీగా దేన్నీ దాచకుండా తొణక్కుండా సమస్యని పూర్తిగా అర్థమయ్యేవిధంగా వివరించడం, తెలీనిదాన్ని కనుక్కుని మరీ వ్యకపరచడం, రాష్ట్రం నలుమూలలనుంచి వస్తున్న వార్తలమీద పూర్తి అజమాయిషీ అవగాహన, చిన్న చిన్న విషయాలని కూడా వదిలిపెట్టకుండా అడ్రెస్ చేసే పద్దతి. ఇకా ఎన్నో. నాకే మాటలు దొరకడం లేదు.
28 వ తారీఖు ప్రెస్ మీట్ చూసి అంత గొప్పది ఈ మధ్యలో చూడలేదనుకుంటూ ఉంటే నిన్నటి ప్రెస్ మీట్ దాన్ని మించిపోయింది.
ఎవరికి ఏ సందేహాలున్నా, ఎన్నోరకాలుగా దుగ్దని చూపుతూ లోలోపల ఉడికిపోతూ ఉన్నా, ఎన్ని పేర్లతో కించపరచాలని ప్రయత్నించినా తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది ఎంతటి చారిత్రక అవసరమో, రాష్ట్రం ఏర్పడినాక పదేళ్ళలోపే పాలనా పరంగా, అభివృద్ది పరంగా, ఇప్పుడు మనకు కనబడుతున్న క్రైసిస్ మేనేజిమెంట్ పరంగా ఎన్ని రకాలుగా పోల్చుకున్నా, ఏ రాష్ట్రంలో ప్రజల మనుగడ సులభంగా ఉందీ అని రెండు రాష్ట్రాలుగా మారిన తెలుగు ప్రజలు స్పష్టంగా గమనించొచ్చు.
చిల్లర రాజకీయాలు లేవు, చిల్లర నాయకులు చేసే చిల్లర ఆరోపణలు- ప్రత్యారోపణలు లేవు, ఇంతటి ఆపత్కాలంలో కూడా రాజకీయాలు మాట్లాడే ప్రజలూ, నాయకులూ లేరు. ఉన్నా వారిని పట్టించుకునేనాథులూ లేరు.
తెలంగాణా వచ్చి ఏం ఒనగూడింది? తెలంగాణా రాష్ట్రానికి ఆంధ్రా నుంచి వలసలు ఎక్కువవ్వడమే జరుగబోతుంది. ఇంకో పదేళ్ళకి తేలతాయి లెక్కలు.
ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, కేరళ ముఖ్యమంత్రి విజయన్, డిల్లీ కేజ్రీవాల్ వీరందరితో సమానంగా ప్రస్తుతం దేశంలో నానుతున్న పేరు కే సీ ఆర్ గారిదే. ముఖ్యంగా సమయానుకూలంగా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా చేసుకోవడంలో మన సమకాలీన నాయకులతో పోల్చి చూస్తే అర్థమౌతుంది. గత ఆరేడేళ్ళ పాలనా పరమైన విధానాలని చూడండి.
గొప్ప గొప్ప విజయాలని, గొప్ప గొప్ప ఓటముల్ని ప్రజలే కట్టబెట్టడం చూసి అర్థం చేసుకోవాలి. తేడా ఎక్కడుందీ అని.
నువ్వేం చెయ్యగలవో, నీకేం చేతనవునో కాదు. నీకు కావలసింది ఏమిటో చెయ్యగలగడంలోనే ఉంది నాయకత్వ పటిమ.ఆఖరికి భాషని మార్చి ఇతర రాష్ట్రాలవారు అర్థం చేసుకునే భాషలో ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో వివరించేందుకు వెనుకాడని వినయం. అది చూసేందుకు మనలో ముఖ్యంగా సహానుభూతి అనేది ఉండాలి. తప్పుల్ని వేగంగా సరిదిద్దుకుంటూ కార్యోన్ముఖం కావడానికి పరిణితి ఉండాలి.
ఒకప్పుడు మాటలు తూలనాడిన మనిషే, అది అవసరం. నాయకులని అనే వాటిని వారి అనుచరులు వారికి ఆపాదించుకున్న తీరు వల్ల జరిగిన అవగాహనా లోపం అది. రాష్ట్రం వచ్చినాక సెటిలర్స్ అనే పదాన్ని నిషేధించింది ఎవరు. ఇక్కడ కొంపా గూడూ వదులుకుని సొంత రాష్ట్రానికి వెళ్ళిపోవల్సిన పరిస్థితి ఎంతమందికి వచ్చింది? – సమాధానం నేనే చెపుతాను – సున్నా ! గత ఆరేడేళ్ళలో హైదరాబాదుకి వలసొచ్చిన ప్రజానీకం ఎంతమంది? రమారమి రోజుకు అయిదువేలు.
నా కింద మంత్రిగా పనిచేశాడు అనే మాటల్లో చూపిన హీనత్వానికీ, ఇక్కడి ఐటీ వృద్ధిలో ఆయన కాంట్రిబ్యూషన్ లేకపోతే ఇదంతా ఉండేదే కాదనీ ఒప్పుకునే పరిణితికీ తేడా ప్రజలు గుర్తించారు కాబట్టే ఫలితాలు ఇలా ఉన్నాయి. కళ్ళు తెరిచే పరిస్థితి అక్కడ లేదు. కళ్ళుమూసుకునిపోయే నాయకత్వమూ కాదిక్కడ.
సమకాలీన నాయకుల్లో ఒక ఇరవై ముప్పై ఏళ్ళ తరువాత కూడా గొప్పగా దేశ ప్రజలు గుర్తుపెట్టుకోబోయే నాయకుల్లో కే సీ ఆర్ ముందు వరుసలో ఉంటారు. ప్రాబబ్లీ అందరికన్నా ముందు.