మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మహిళల జట్టు జైత్రయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.. జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి.. ఈ టోర్నీలో వరుసగా భారత్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. 233 పరుగుల లక్ష్యఛేదనతో బరిలో దిగిన శ్రీలంకను నిర్ణీత ఓవర్లలో 216 పరుగులకు భారత్ బౌలర్లు కట్టడి చేశారు. శ్రీలంక వికెట్ కీపర్ దిలాని మండోదర (61) చేసిన ఒంటరి పోరాటం వృథా అయింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసి విజయానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయింది. భారత్ బౌలర్లలో జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్ రెండేసి, డీబీ శర్మ, బిస్త్ చెరో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు స్మృతి మంధాన (8), పూనమ్ రౌత్ (16) వెంటవెంటనే అవుటవడంతో 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో దీప్తి శర్మ (78), కెప్టెన్ మిథాలీ రాజ్ (53) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో శ్రీపాలి వీరక్కొడి 3 వికెట్లు పడగొట్టగా ఇనోక రణవీరా 2, శశికళ సిరివర్ధనే, అమ కంచన చెరో వికెట్ తీశారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన టీమిండియా బ్యాట్స్ విమెన్ దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.