అప్పుల భారతం..!

193
Narendra Modi
- Advertisement -

భారతదేశం గతంలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పెద్ద నోట్ల రద్దుతో దేశాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి నెట్టేసిన ఘనత మోదీకే దక్కింది. ఇక ఒకే దేశం..ఒకే పన్ను పేరుతో హడావుడిగా జీఎస్టీ తీసుకువచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసింది. జీఎస్టీ ద్వారా కేంద్రానికి నెలకు రూ. లక్ష కోట్ల ఆదాయం వస్తోంది. ఆ సొమ్ములన్నీ ఏమవుతున్నాయో లెక్కలు లేవు..అసలు పెద్ద నోట్ల రద్ధు కంటే జీఎస్టీతోనే దేశానికి ఎక్కువ నష్టం జరిగిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ… లక్షల కోట్ల రూపాయల దేశ సంపదను తన గుజరాతీ దోస్తులైన అంబానీలు, అదానీలకు అప్పగించేస్తున్న తీరు భారతీయులను కలిచివేస్తోంది. ఇదేంటని మోదీని నిలదీసిన వారిని బీజేపీ భక్తులు దేశద్రోహులుగా ముద్రవేయడం, కేసులు పెట్టి వేధించడం కామన్ అయిపోయింది.

75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నడూ లేనంతగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన మోదీ.. .అంబానీలు, అదానీలు వంటి క్యాపిటలిస్టులకు కొమ్ము కాస్తూ నిరంకుశ పాలకుడిగా మారిపోయాడు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. గత నాలుగు నెలలుగా కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు ఢిల్లీ రోడ్లపై ఆందోళనలు చేస్తున్నా…మోదీ పట్టించుకోవడం లేదు. తనకు దేశ రైతుల కంటే..తన కార్పొరేట్ స్నేహితుల ప్రయోజనాలే మిన్నగా మోదీ భావిస్తున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా బ్యాంకుల ఉద్యోగులు కేంద్రానికి వ్యతిరేకంగా సమ్మె బాట పట్టారు. ఐడీబీఐతోపాటూ మరో రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించబోతున్నట్లు కేంద్రం ప్రకటించడంతో బ్యాంకు ఉద్యోగులు రోడ్డెక్కారు. ప్రభుత్వ బ్యాంకులను మరింత బలోపేతం చేసి ఆర్థికవ్యవస్థను వేగవంతం చేసే చర్యలు తీసుకునేది పోయి..మోదీ సర్కార్ ప్రభుత్వ బ్యాంకులను మెల్లగా ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడంతో దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాంకు ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో బ్యాంకు యూనియన్లు నిర్వహిస్తున్న సమ్మెకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మద్దతు పలికారు.

ఈ సందర్భంగా బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. దేశాన్ని క్యాపిటలిస్ట్‌లకు అప్పగించాలనేది బీజేపీ సిద్ధాంతమని ఫైర్ అయ్యారు. సమ్మెలు, ఉద్యమాలు మోదీ ప్రభుత్వం లెక్కచేయదన్న విషయం పంజాబ్ రైతుల ఆందోళనతో తేలిపోయిందని చెప్పారు. మోదీ ప్రభుత్వంపై మేధోతనంతోనే పోరాడాలని సూచించారు. సోషలిస్టు దేశాన్ని క్యాపటలిస్ట్‌ దేశంగా మార్చేస్తామని రాజ్యాంగ సవరణ చేయడంపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీయాలని, అప్పుడే బీజేపీ బండారం బయటపడుతుందని ఉండవల్లి అన్నారు. మోదీ ప్రధాని అయ్యేనాటికి 46 లక్షల కోట్లు ఉన్న మన దేశం అప్పు.. ఇప్పుడు కోటి 7 లక్షల కోట్లకు చేరుకుందన్న షాకింగ్ నిజాలను ఉండవల్లి బయటపెట్టారు. 1969లో ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేయడం వల్లే ప్రపంచ ఆర్థిక సంక్షోభంలోనే మన దేశం నిలబడిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వానికి పరిపాలన చేయడం సాధ్యం కావడం లేదని ఎద్దేవా చేశారు. చివరకు రక్షణ రంగంలోనూ విఫలం కావడంతో నేపాల్ వంటి చిన్నదేశం కూడా మనదేశంపై కాలుదువ్వుతోందని ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మొత్తంగా దేశాన్ని ప్రభుత్వ రంగ సంస్థలను తన అనుంగు మిత్రులకు ధారాదత్తం చేస్తూ..యావత్ దేశాన్ని క్యాపిటలిస్ట్‌లకు తాకట్టు పెడుతున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది..దేశ ప్రజలారా జాగో..బీజేపీ హఠావో..దేశ్ బచావో..!

- Advertisement -