H1-B Visa:అమెరికాకు భారత్ కౌంటర్

1
- Advertisement -

హెచ్‌1బీ వీసాలకు సంబంధించి అమెరికా తీసుకున్న నిర్ణయంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎనిమిది భారతీయ ఐటీ సంస్థలకు సంబంధించి పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతీయ వలస ఉద్యోగులను ‘ఒప్పంద బానిసలు’ (Indentured Servants)గా అభివర్ణించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఆయన వ్యాఖ్యలు అనుచితమైనవని, తీవ్ర అవమానకరమైనవని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పేర్కొంది.

భారతీయ నిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు, సాంకేతిక రంగ అభివృద్ధికి అందిస్తున్న సేవలను విదేశాంగ శాఖ గుర్తుచేసింది. భారతీయ వలసదారుల కృషి, వ్యాపార నైపుణ్యం, ఆవిష్కరణలు అమెరికా అభివృద్ధి, ఆర్థిక శ్రేయస్సులో కీలక పాత్ర పోషించాయని తెలిపింది.

అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు అక్కడి ఆర్థిక, సాంకేతిక వ్యవస్థలో కీలక భాగమని విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రతిభావంతులైన ఉద్యోగుల రాకపోకలు భారత్, అమెరికా రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తాయని వివరించింది. భారతీయులకు ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు, అమెరికా కంపెనీలకు అత్యాధునిక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు అందుబాటులోకి వస్తారని తెలిపింది.

దీంతో ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగాల కల్పన పెరుగుతాయని, అమెరికాలో వాటాదారుల సంపద కూడా వృద్ధి చెందుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనాలు చేకూర్చే అంశాన్ని అన్ని వర్గాలు గుర్తించాలని భారత్ అభిప్రాయపడింది.అమెరికా తాజాగా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యాల సాధనకు దోహదపడవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

పర్మ్ (PERM), హెచ్‌1బీ వీసా కార్యక్రమాలు వేర్వేరని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పర్మ్ దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేయడం వల్ల ఇప్పటికే చెల్లుబాటులో ఉన్న హెచ్‌1బీ వీసాలు రద్దు కావని, వీసాదారులు లేదా వారి కుటుంబ సభ్యుల ఇమ్మిగ్రేషన్ స్థితిపై నేరుగా ప్రభావం పడదని వివరించింది.అయితే, సంబంధిత సంస్థల్లో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగుల శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) పొందే ప్రక్రియపై కొంత ప్రభావం ఉండవచ్చని తెలిపింది.చారిత్రకంగా బాధాకరమైన, వలసవాద వారసత్వాన్ని గుర్తుచేసే పదాలను ఉపయోగించడం తీవ్ర అవమానకరమని భారత్ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారం దృష్ట్యా ఇటువంటి వ్యాఖ్యలు తగవని అభిప్రాయపడింది.

Also Read:భారత్‌తో టీ20 సిరీస్‌..డబుల్ షాక్!

- Advertisement -