బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు..బిగ్‌ అప్‌డేట్

3
- Advertisement -

దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒకటైన ముంబై–అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. భూసేకరణలో జాప్యం, కరోనా మహమ్మారి ప్రభావం, మహారాష్ట్రలో ప్రభుత్వ మార్పు, భారత్‌–జపాన్‌ మధ్య సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై భిన్నాభిప్రాయాలు ఈ ప్రాజెక్టును ఆలస్యానికి గురిచేశాయి. తొలుత పూర్తిస్థాయి జపాన్‌ సాంకేతిక వ్యవస్థతో నిర్మించాలని భావించిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు జపాన్‌ మౌలిక సదుపాయాలు, యూరప్‌ సిగ్నలింగ్‌ సాంకేతికత, భారత్‌లో తయారయ్యే రైళ్లతో కూడిన కొత్త నమూనా దిశగా సాగుతోంది.

ముంబై నుంచి అహ్మదాబాద్‌ వరకు 508 కిలోమీటర్ల మేర హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ నిర్మాణానికి 2017 సెప్టెంబర్‌లో పనులు ప్రారంభమయ్యాయి. జపాన్‌ సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును తొలుత 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానంగా ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణ కీలక సమస్యగా మారింది. ముఖ్యంగా 2019లో మహారాష్ట్రలో ప్రభుత్వం మారిన తర్వాత భూసేకరణ, భూముల వినియోగానికి సంబంధించిన ప్రక్రియల్లో అనిశ్చితి ఏర్పడింది. 2024 ఎన్నికల తర్వాత ఈ సమస్యలు పరిష్కారమయ్యే వరకు జాప్యం కొనసాగింది. మరోవైపు, కరోనా మహమ్మారి కూడా నిర్మాణ పనులపై ప్రభావం చూపింది.

భారత్‌, జపాన్‌ మధ్య ప్రాజెక్టు అమలు విధానంపై కూడా భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. జపాన్‌ తన షింకన్‌సెన్‌ వ్యవస్థలోని రైళ్లు, పట్టాలు, సిగ్నలింగ్‌ సహా మొత్తం సాంకేతిక వ్యవస్థను అందించాలని భావించింది. అయితే భారత్‌ మాత్రం అధిక వ్యయంతో కూడిన దిగుమతులపై పూర్తిగా ఆధారపడకుండా, స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించింది. ఖర్చు తగ్గించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివృద్ధి చేయడం, భవిష్యత్తులో ఇతర హైస్పీడ్‌ రైలు మార్గాలకు స్వేచ్ఛగా విస్తరించే అవకాశం కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది.

జపాన్‌ రూపొందించిన E10 షింకన్‌సెన్‌ రైళ్లను 2034కు ముందు అందించడం సాధ్యం కాదని స్పష్టమైన నేపథ్యంలో, భారత్‌ 2024లో సొంత బుల్లెట్‌ రైలును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. బెంగళూరులోని బీఈఎంఎల్‌ (BEML) సంస్థ B28 పేరుతో భారతీయ హైస్పీడ్‌ రైలును తయారు చేస్తోంది. ఈ రైలు గరిష్ఠంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడిచేలా అభివృద్ధి చేస్తున్నారు.

Also Read:Delhi AQI..అప్‌డేట్

బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ప్రారంభ అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం అది దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరింది. మొత్తానికి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో భారత్‌–జపాన్‌ మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పుడు కొంతవరకు సమసిపోయినప్పటికీ, నిర్మాణం, సాంకేతిక సమన్వయం, భద్రత, నిర్వహణ వంటి అంశాలు కీలకంగా మారాయి. తొలి సెక్షన్‌ను 2027 డిసెంబర్‌ నాటికి ప్రారంభించాలని టార్గెట్‌ను పెట్టుకోగా అనుకున్న సమయానికి పూర్తవుతుందో లేదో చూడాలి.

- Advertisement -