ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. అక్టోబర్ 30న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, కార్యాచరణపై నేతలు చర్చించారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రాతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, గౌరవ్ గొగోయ్, పవన్ ఖేరా, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్ సమావేశాల తరహాలో నిర్వహించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పక్షాల తరహాలో వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. సుమారు 40 మంది ప్రసంగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం ఉంది. మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 30న మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీలోని 10, రాజాజీ మార్గ్‌లో ఉన్న ఖర్గే అధికారిక నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలుత మరో రెండు వేదికల్లో నిర్వహించాలని ప్రయత్నించినప్పటికీ అనుమతులు లభించలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
Also Read:తులాభారం షూట్లో రవితేజ

