దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ 16 పరుగుల తేడాతో జయకేతనం ఎగరవేసి మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ పట్టేసింది.భారత్ విధించిన 237 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు 3వికెట్లు కొల్పోయి 221 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (47 బంతుల్లో 106 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగినా ఫలితం లేకపోయింది. డికాక్ (48 బంతుల్లో 69 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు.
ఇక అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ (22 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టాడు. విరాట్ కోహ్లీ (28 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్), రోహిత్ శర్మ (43; 7 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై టీమ్‌ఇండియా టీ20 సిరీస్ చేజిక్కించుకోవడం ఇదే తొలిసారి.