ఇంగ్లండ్‌పై టీమిండియా గెలుపు.. సిరీస్ కైవసం..

386
india
- Advertisement -

భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. పుణే వేదికగా జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ పై 7 పరుగుల తేడాతో నెగ్గి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 330 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ శామ్ కరన్ చివరి వరకు పోరాడాడు. ఇన్నింగ్స్ 50వ ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా, నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియాకు విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులు చేయగా… ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులు చేసి ఓటమిపాలైంది. వీరోచితంగా పోరాడిన శామ్ కరన్ 95 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. అంతకుముందు డేవిడ్ మలాన్ (50), బెన్ స్టోక్స్ (35), లివింగ్ స్టన్ (36), మొయిన్ అలీ (29) రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4, భువనేశ్వర్ కుమార్ 3, నటరాజన్ ఓ వికెట్ తీశారు. కాగా, ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్ లు టీమిండియా గెలుచుకుంది.

- Advertisement -