రాజ్ కోట్ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తొలి వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. సమిష్టిగా రాణించిన కోహ్లీ సేన సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
భారత్ విధించిన 341 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (102 బంతుల్లో 98; 9 ఫోర్లు, 1 సిక్స్) రెండు పరుగులతో సెంచరీ మిస్ చేసుకోగా.. లబుషేన్ (46), ఫించ్ (33) ఫర్వాలేదనిపించారు. 37 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 219/3తో పటిష్ఠ స్థితిలో ఉండగా ఒక ఒవర్‌లో స్మిత్, కారీలను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు కుల్దీప్ యాదవ్. తర్వాత షమీ కూడా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది.
అంతకముందు టాస్ గెలిచిన ఆసీస్…భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 340 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ ( 96 ) ,లోకేశ్ రాహుల్ ( 80), విరాట్ కోహ్లీ ( 78) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో షమీ 3, జడేజా, కుల్దీప్, సైనీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.