గబ్బా టెస్ట్‌లో భారత్ ఘన విజయం..

44
india won

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో టీమిండియా- ఆసీస్ మధ్య జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌ భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ చివరి టెస్ట్‌లో గెలిచి 2-1తో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మ‌న్ గిల్ (91), రిష‌బ్ పంత్(89 నాటౌట్‌) ఫైటింగ్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయారు. ఇక పుజారా (56) టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో నిలిచిపోయే అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించిపెట్టారు. 328 పరుగుల భారీ ల‌క్ష్యాన్ని టీమిండియా ఛేదించ‌డం విశేషం. చివ‌రి వ‌ర‌కూ ఉత్కంఠ మ‌ధ్య జ‌రిగిన ఈ మ్యాచ్‌.. టెస్ట్ క్రికెట్‌లోని అస‌లైన మ‌జాను రుచి చూపించింది.

ఇక నాలుగు పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరిరోజు ఆటను ప్రారంభించి టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురెబ్బ తగలింది. ఓపెనర్‌‌ రోహిత్‌ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత మరో ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌తో జతకట్టిన చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌‌ను ముందుండి నడిపించాడు. యువ బ్యాట్స్‌మెన్‌‌ గిల్‌ అద్భుతమైన ఆటతీరుతో హాఫ్‌ సెంచరీ సాధించి.. 91 పరుగుల వద్ద వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

ఆ తర్వాత పుజారా, రహానే కొంచెం సేపు ప్రతిఘటించారు. అయితే, ఫస్ట్ నుంచే దూకుడు మీద కన్పించిన రహానే అనవసరపు షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. మరోవైపు తనదైన స్టైల్ లో బ్యాటింగ్ చేసిన పుజారా మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే 56 పరుగులు చేసిన తర్వాత పుజారా కమిన్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత మయాంక్ తొమ్మిది పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే, ఆ తర్వా త పంత్ తనదైన స్టైల్ లో ఆడి టీమిండియాకు విక్టరీని అందించాడు. రిషభ్ తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా తన బ్యాట్ కు పని చెప్పడంతో టీమిండియా ఈజీగా విక్టరీ కొట్టింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ టెస్ట్ లో ఘోర ఓటమి తర్వాత టీమిండియా సిరీస్ గెలవడం అమోఘం. తాత్కాలిక కెప్టెన్ రహానే టీమిండియాను అద్భుతంగా ముందుండి నడిపించాడు. గత 31 టెస్టుల్లో తమకు పరాజయం తెలీని గబ్బా మైదానంలో.. అత్యుత్తమ ఎలెవన్‌ అందుబాటులో లేని భారత్‌ మట్టికరిపించింది.