కబడ్డి ప్రపంచకప్‌:సెమీస్‌కు చేరువలో భారత్‌

70
India beat Argentina to keep semi-final hopes alive
India beat Argentina to keep semi-final hopes alive

కబడ్డీ ప్రపంచకప్‌లో వరుసగా మూడో విజయం సాధించిన భారత్‌ సెమీస్‌కు మరింత చేరువైంది.శనివారం జరిగిన మ్యాచ్‌లో 74-20 తేడాతో అర్జెంటీనాను చిత్తుచిత్తుగా ఓడించింది. 54 పాయింట్ల తేడాతో ఓ జట్టు నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. తమ కెరీర్‌లో తొలిసారిగా ప్రపంచకప్ ఆడుతున్న అర్జెంటీనాను ప్రారంభ ఐదు నిమిషాల్లోనే భారత్ ఆలౌట్ చేసింది. ప్రథమార్ధానికే భారత్‌ 36-13తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో మరింత ధాటిగా ఆడి భారత్‌ భారీ విజయాన్ని నమోదు చేసింది.

india

ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన అజయ్‌ ఠాకూర్‌ ఏకంగా 14 పాయింట్లు కొల్లగొట్టాడు. అందులో రైడ్‌ పాయింట్లే 11. మూడు ట్యాకిల్‌ పాయింట్లు సాధించాడు. రాహుల్‌ చౌదరి 11 పాయింట్లు సాధించాడు. రాహుల్‌ 11 రైడ్లకు వెళ్తే తొమ్మిదిసార్లు పాయింట్లతో వచ్చాడు. ఒక్క మోహిత్‌ చిల్లర్‌ మినహా జట్టులో మిగతా ఆటగాళ్లందరూ పాయింట్లు సాధించారు. సురేందర్‌ నాడా (7), సుర్జీత్‌ (6), మన్‌జీత్‌ చిల్లర్‌ (5), పర్దీప్‌ నర్వాల్‌ (5) కూడా సత్తా చాటారు. 4 మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో 16 పాయింట్లు సాధించిన భారత్‌.. గ్రూప్‌-ఎలో రెండో స్థానంలో కొనసాగుతోంది. . 18న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ నేరుగా సెమీస్‌ చేరుతుంది.

సెమీస్‌లో కొరియా, ఇరాన్
గ్రూప్‌-ఎలో జరిగిన మరో మ్యాచ్‌లో 63-25తో ఆస్ట్రేలియాను ఓడించిన దక్షిణ కొరియా.. ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరిన తొలి జట్టయింది. తమ స్టార్ ఆటగాడు జంగ్ కున్ లీ అందుబాటులో లేకపోరుునా కొరియా చెలరేగింది. ప్రస్తుతం నాలుగు విజయాలతో 20 పారుుంట్లు సాధించి గ్రూప్ ‘ఎ’లో టాప్‌లో కొనసాగుతోంది. మరో గ్రూప్ ‘బి’లో ఇరాన్ జట్టు కూడా వరుసగా నాలుగో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. జపాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 38-34 తేడాతో నెగ్గింది.