వరల్డ్ కప్ లో సెమీస్ బెర్త్ ల కోసం ఆసక్తికరమైన పోరు నడుస్తోంది. ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా జట్లు సెమీస్ చేరగా.. నిన్న ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మద్య జరిగిన మ్యాచ్ లో ఆసీస్ ఘన విజయం సాధించడంతో ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ఒకానొక దశలో ఆసీస్ జట్టు పనైపోయింది అనుకున్న సమయంలో గ్లెన్ మ్యాక్స్ వెల్ వీరోచిత ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించి సెమీస్ చేర్చాడు. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఆ తరువాత లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా 60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో విజయంపై ఆశలు సన్నగిల్లిన వేళ మ్యాక్స్ వెల్ పట్టువదలకుండా చివరి వరకు నిలిచి 201 పరుగుల డబుల్ సెంచరీతో చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. దాంతో సెమీస్ చేరిన మూడో జట్టుగా ఆసీస్ నిలిచింది. .
ఇక నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్టు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. రేపు శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడనుండగా ఈ మ్యాచ్ తో సెమీస్ చేరే నాలుగో జట్టు ఏదో తేలిపోనుంది. శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే సెమీస్ చేరే అవకాశం ఉంది. అలా కాకుండా కివీస్ జట్టు ఓడిపోతే పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ సెమీస్ చేరితే దాయాదుల పోరు మరోసారి జరిగే అవకాశాలు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న టీమిండియా అలాగే నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో తలపడాల్సి ఉంటుంది. అలాగే రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా.. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. మరి పాకిస్తాన్ సెమీస్ చేరుతుందేమో చూడాలి.
Also Read:మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ..ఆసీస్ అద్భుత విజయం