వరల్డ్ కప్ లో రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమైంది. నేడు టీమిండియా, న్యూజిలాండ్ జట్లు మొదటి సెమీస్ మ్యాచ్ ఆడనున్నాయి. ముంబై లోని వాఖండే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ మద్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు అర్హత సాదించగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ప్రస్తుతం ఇరు జట్లు కూడా అత్యంత పటిష్టంగా ఉండడంతో క్రీడా విశ్లేషకులు సైతం గెలుపును అంచనా వేయలేకపోతున్నారు. టోర్నీ లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్ ల్లోనూ భారీ విజయాలు నమోదు చేసిన టీమిండియా సెమీస్ లో కూడా సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా లీగ్ దశలో న్యూజిలాండ్ జట్టును ఓడించిన రోహిత్ సేన సెమీస్ లో లైట్ తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని క్రీడా నిపుణులు హెచ్చరిస్తున్నారు..
2019 వరల్డ్ కప్ లోనూ సెమీస్ లో కివీస్ చేతిలో ఓటమి చవి చూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది టీమిండియా. దాంతో అదే కివీస్ జట్టు పై ఈసారి వరల్డ్ కప్ లో ప్రతీకారం తీర్చుకునే టైమ్ వచ్చింది. ప్రస్తుతం టీమిండియా అన్నీ విభాగాల్లోనూ అద్బుతంగా రానిస్తోంది. అటు కివీస్ కూడా అదే స్థాయిలో ఫామ్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు మూడు సార్లు సెమీస్ కు, రెండు సార్లు ఫైనల్ కు చేరిన న్యూజిలాండ్ ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని కసితో ఉంది. అందువల్ల కివీస్ ను తక్కువగా అంచనా వేస్తే కోట్ల అభిమానుల ఆశలను ఆవిరి చేస్తూ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక వాఖండే స్టేడియంలో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు పిచ్ అనుకూలతను బట్టి బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇరు జట్ల కూర్పు విషయంలో కూడా ఎలాంటి మార్పులు ఉండబోదని తెలుస్తోంది. మరి అభిమానుల అంచనాలు అందుకొని కప్పు వేటలో రోహిత్ సేన సెమీస్ లో విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెడుతుందేమో చూడాలి.
Also Read:Bigg Boss 7 Telugu:ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది