విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో భారత్ సత్తా చాటింది. ఏకంగా 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించి మొదటి టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అల్ రౌండ్ ప్రతిభతో రోహిత్ సేన మరోసారి తిరుగులేని జట్టుగా నిరూపించుకుంది. రెండో టెస్ట్ విజయం టీమిండియాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే జట్టులో రోహిత్ మినహా స్టార్ ఆటగాళ్లు ఎవరు లేకపోయినప్పటికి కుర్రాళ్ళు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హర్ధిక్ పాండ్య, షమి, సిరాజ్.. ఇలా కీలక ఆటగాళ్లు అందరూ దూరమైనప్పటికి కుర్రాళ్ళు రాణించిన తీరు అందరిని మంత్రముగ్దులను చేసింది. దీంతో టీమిండియాకు స్టార్స్ అవసరం లేదని యువ ఆటగాళ్లు చెప్పకనే చెప్పారు. ఇక రెండో టెస్ట్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానాన్ని మెరుగుపరుచుకుంది.
రెండోస్థానంలో కొనసాగుతూ వచ్చిన టీమిండియా.. ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ ఓటమితో ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది. అయితే తాజాగా జరిగిన రెండో టెస్ట్ విజయంతో మళ్ళీ తిరిగి రెండో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 2023-25 ఎడిషన్ కు గాను ఆరు టెస్ట్ మ్యాచ్ లలో మూడు మ్యాచ్ లలో గెలిచి రెండిట్లో ఓడిపోయింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దాంతో ప్రస్తుతం టీమిండియా 38 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా.. మూడో స్థానంలో సౌతాఫ్రికా జట్టు ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ లో చెరో విజయాన్ని ఖాతాలో వేసుకొని సమంగా నిలిచాయి. దాంతో రాజ్ కోట్ వేధికగా జరిగే మూడో టెస్ట్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి. ప్రస్తుతం క్రీడా వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మూడో టెస్ట్ మ్యాచ్ కు కోహ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందట. మరి జట్టు కూర్పులో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.
Also Read:పెళ్లిపుస్తకం తర్వాత లగ్గం : రాజేంద్రప్రసాద్