టీమిండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు చివరి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా సిరీస్ ను సొంతం చేసుకోగా.. ఈ మ్యాచ్ నామమాత్రంగా జరగనుంది. ఇక చివరి మ్యాచ్ లో గెలిచి పరువు నిలబెట్టుకునేందుకు ఆసీస్ ఆరాటపడుతుంటే.. చివరి మ్యాచ్ లో కూడా గెలిచి ఘనంగా సిరీస్ ముగించాలని టీమిండియా భావిస్తోంది. ప్రస్తుతం ఇరు జట్లలో టీమిండియా కొంత బలంగా కనిపిస్తోంది.
బ్యాటింగ్ లో జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్.. ఇలా ప్రతి ఒక్కరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అటు బౌలింగ్ విభాగంలో కూడా రవి బిష్ణోయ్, హర్ష దీప్ వంటివారు రాణిస్తే.. చివరి మ్యాచ్ లో కూడా టీమిండియాకు తిరుగుండదు. ఈ మ్యాచ్ లో పిచ్ కీలకంగా మారనుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం చిన్నది కావడంతో భారీ స్కోరు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకి ఉండదని, వాతావరణం పొడిగా ఉంటుందని, గాల్లో తేమ 72 శాతం ఉండే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించి గెలుపు ఉత్సాహంతో దక్షిణాఫ్రికా టూర్ బయలుదేరాలని టీమిండియా భావిస్తోంది. మరి నామమాత్రంగా జరిగే ఈ చివరి మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.
Also Read:హూ ఈజ్ ‘కింగ్ మేకర్ ‘ !