నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్‌ ఘనవిజయం

82
teamindia

అహ్మదాబాద్ వేదికగా మొతెరాలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించింది. అన్ని రంగాల్లో విశేషంగా రాణించిన భారత్ ఇన్నింగ్స్ 25 పరుగుల భారీ తేడాతో టెస్టును గెలుచుకుంది. 160 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 135 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా స్పిన్ ద్వయం అశ్విన్, అక్షర్ మరెవ్వరికీ అవకాశం ఇవ్వకుండా వికెట్లన్నీ ఇద్దరే పంచుకున్నారు. చెరో 5 వికెట్లు సాధించి భారత్ విజయంలో ప్రధానభూమిక పోషించారు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో డాన్ లారెన్స్ చేసిన 50 పరుగులే అత్యధికం. కెప్టెన్ జో రూట్ 30 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకు ఆలౌటైంది. బదులుగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 365 పరుగులు చేసి 160 పరుగుల ఆధిక్యం సాధించింది.

కాగా, ఈ విజయంతో భారత్ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ కు అర్హత సాధించింది. 4 టెస్టుల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుని, లార్డ్స్ మైదానంలో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ లో సగర్వంగా అడుగుపెట్టింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ జూన్ 18 నుంచి 22 వరకు జరగనుంది.

స్కోరు బోర్డు

ఇంగ్లండ్ 205, 135
ఇండియా 365