‘జగమే మరిపింపజేయునది కన్న తల్లి ప్రేమ…..శిశువైనా, పశువైనా తన తల్లి ఒడికే పరుగులు తీయునులే… జననీ అను మాటలోనే తరయించు మనిషి జన్మ’ అన్నాడు ఓ సినీకవి. అమ్మ అనే పదానికి అంతటి మహత్మ్యం ఉంది. మనకు జన్మనిచ్చి, ఇంతటి వారిని చేసిన దేవుళ్లను కళ్ల ముందు ఉంచుకుని, కనిపించని ఆ దేవుడు కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతాం. బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. జన్మనిచ్చిన తల్లికి ఏమిచ్చినా తక్కువే. ఆమె రుణం తీర్చుకోలేనిది. నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన దేవతామూర్తి అమ్మ..
పోటీ ప్రపంచం నిజమే! ఫోన్లో నాలుగు నిమిషాలు అమ్మతో మాట్లాడ్డానికి తీరికలేని వాళ్లు మన మధ్యే ఉన్నారు.కానీ ఆ నెపంతో అమ్మలను అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారు. అసలు అమ్మకి ఇప్పుడు ఎంతమంది ప్రేమను పంచుతున్నారు? ఎంతమంది వృద్ధాశ్రమాల పాల్జేసి వెళ్తున్నారు? ఎక్కడో పల్లెటూళ్లో విడిచి పెట్టి రెక్కలు గట్టుకుని పట్టణాలకు ఎగిరిపోతున్నారు. ఉద్యోగం ముసుగులో ముసలివాళ్లను దిక్కులేని వాళ్లను చేస్తున్నారు. కన్నబిడ్డలే కాదుపొమ్మంటే- ముసలి తల్లిదండ్రులు ఎక్కడుండాలో తెలియక ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నారు. అందరూ ఉన్నా అనాథల్లా బతుకుతున్నారు. జగమంత కుటుంబంలో ఏకాకి జీవితం గడుపుతున్నారు.
Also Read:ఉంగరాల జుట్టు… సంరక్షణ చిట్కాలు
అనాథలైన తల్లిదండ్రుల్లో ఎక్కువ అవస్థ తల్లులదే! ఎందుకంటే భర్తలను పోగొట్టుకుని, అయినవాళ్లను దూరం చేసుకుని, వాళ్లుపడే నరకయాతన అంతా ఇంతా కాదు. ప్రతీదీ డబ్బుతో కొలిచే ఈ తరానికి- ఆ పచ్చనోట్లతో వెలకట్టలేని కన్నపేగు ఒకటుంటుందనే విషయం తెలియదు. తెలిస్తే ఇలా జరగదు. చిన్నప్పుడు ఏడిస్తే కొంగుతో తుడిచే అమ్మ మనసుని- పెద్దయ్యాక కన్నీళ్లపాలు చేయడం ఎంతవరకు సబబు. ఉద్యోగం, కెరీర్. జీవితమంటే ఇదేనా? అమ్మతో గడపడానికి బొత్తిగా పదినిమిషాలు కూడా దొరకడం లేదా? సెలవులొస్తే భార్యాబిడ్డలతో గడపడానికి మాత్రం వదులుకోరు. అదే అమ్మను చూడాలనంటే సవాలక్ష వంకలు. ఇది కాదు జీవితం. అమ్మను చూడాలి. అమ్మతో మాట్లాడాలి. అమ్మ చేతివంట తినాలి. ఆమె చల్లని దీవెనలు తీసుకోవాలి. మదర్స్ డే రోజున మాత్రమే తల్లిని తలుచుకునే సంస్కృతి మారాలి. అయినా మదర్స్ డే పేరుతో అమ్మ ప్రేమను ఒక్క రోజుకు పరిమితం చేయగలమా? అసలు అమ్మను తలుచుకోడానికి ఒక రోజేంటి? ఒక దినమేంటి? అంతకంటే ఆత్మవంచన మరోటి ఉండదు. కన్నతల్లి ఎప్పుడూ ఒక్కరోజు ఆర్భాటాల్నీ, ప్రశంసాపత్రాల్ని కోరుకోదు. ముదిమి మీద పడితే నేనున్నా అని బిడ్డ ఇచ్చే ఒక్క భరోసా చాలు- అమ్మకి. అన్ని రోజులు అమ్మకే ఉండాలి. అమ్మ ఎప్పుడూ మనతోపాటే ఉండాలి.
Also Read:whatsapp:వాట్సాప్ స్టేటస్ నేరుగా ఫేస్బుక్లో