భానుడు దేశ వ్యాప్తంగా తన ప్రతాపం చూపుతూ మండుటెండలతో ఠారెత్తిస్తున్నాడు. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే.. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అనే ఆందోళన అందరిలోనూ మొదలైంది. ఈశాన్య భారతంలోనూ రోజురోజుకీ ఉష్టోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం జంకుతున్నారు. పట్టణాల్లో గొడుగులు, చల్లటి పదార్థాలతో ప్రజలు సేదా తీరుతున్నారు. పల్లెటూరుల్లో మాత్రం ఉదయానే పొలానికి వెళ్లి సూర్యుడు నెత్తిమీదకు వచ్చేసారికి ఇంటికి వస్తున్నారు. ఈ సమ్మర్‌లో ఎండలు వాయించడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.
116 ఏళ్ల కాలంలో ఉష్ణోగ్రతల్లో 8వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు పలు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమిలా ఎండలు ఉంటాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. వాయవ్య భాగంపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అక్కడ సాధారణం కన్నా ఒక డిగ్రీ కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవవచ్చని వెల్లడించింది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణంకన్నా ఒకడిగ్రీ ఎక్కువగా నమోదవవచ్చని పేర్కొంది. కోర్ హీట్‌వేవ్ జోన్‌లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
ఈ జోన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్రలోని మరఠ్వాడా, మధ్య మహారాష్ట్ర, విదర్భ ఉన్నాయి. 1901 నుంచి చూస్తే 2016లోనే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ ఏడాది రాజస్థాన్‌లోని ఫలోడీలో 51డిగ్రీల సెల్సియస్ నమోదయింది.
ఈసారి తెలంగాణలో సాధారణం కంటే 47 శాతం అధికంగా వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఎల్‌నినో, లానినోల ప్రభావంపై స్పష్టత లేదని .. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, అడవులు అంతరించి పోవడం, గ్లోబల్ వార్మింగ్ తదితర కారణాల వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
పనులమీద బయటకు వస్తున్న ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. కొబ్బరినీళ్లు, శీతలపానీయాలు, మజ్జిగ, చెరకు రసం, పండ్ల రసాలతో దాహార్తిని తీర్చుకునేందుకు పరుగులు తీశారు. నెత్తిపై టోపీ, ముఖానికి గుడ్డ కట్టుకున్నా వేడిమి నుంచి తప్పించుకోలేక పాట్లుపడ్డారు. మధ్యాహ్నం వేళలో రహదారులు, వీధులు జనంలేక నిర్మానుష్యంగా మారుతున్నాయి.
గత ఏడాది విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగా 1,600 మంది మరణించగా అందులో అధిక ఉష్ణోగ్రతల కారణంగా 700 మంది మరణించారు. ఇందులో ఒక్క ఏపీ, తెలంగాణలోనే 400 మంది మరణించారు. ఈ ఏడాది జనవరిలో సాధారణం కన్నా 0.67 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదయినట్లు ఐఎండీ తెలిపింది.