తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం

1
- Advertisement -

పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వేగంగా విస్తరిస్తూ మరింత బలపడింది. ఇది రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) మరియు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించాయి.

పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తున్న ఈ తీవ్ర వాయుగుండం, సెప్టెంబర్ 24వ తేదీ తెల్లవారుజాములోపు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మరియు ఒడిశాలోని గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తీవ్ర ప్రతికూల వాతావరణ వ్యవస్థ ప్రభావం వల్ల రాగల మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర మరియు కోస్తాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ అత్యవసర హెచ్చరికల ప్రకారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షపాత తీవ్రత అత్యధికంగా ఉండనుంది.

ఈ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదుకావచ్చని అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. తీవ్ర వాయుగుండం తీరానికి సమీపించే సమయంలో తీరం వెంబడి గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 70 కిలోమీటర్ల వరకు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. సముద్రం తీవ్రంగా అలజడిగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని జిల్లా యంత్రాంగాలు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి.

Also Read:ఇరుముడి..రూ.250 కోట్ల క్లబ్‌లోకి!

- Advertisement -