తెలంగాణ వ్యాప్తంగా రాగల నాలుగు రోజుల పాటు భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని రోజుల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, సగటు సముద్రం మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కింది స్థాయిలోని గాలులు వీస్తున్నాయని, ముఖ్యంగా ఉత్తర, వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపుకు వీస్తున్నాయని పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ హైదరాబాద్‌తో సహా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది.