IMD:కేరళకు ముందే రుతుపవనాలు!

4
- Advertisement -

దేశవ్యాప్తంగా భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. తీవ్రమైన ఎండలు, హీట్‌వేవ్‌ (ఎండతీవ్రత) తో సతమతమవుతున్న ఉత్తర భారతదేశంతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. ఈ ఏడాది 2026 నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే దేశంలోకి ప్రవేశించనున్నట్లు ఐఎండీ తన తాజా నివేదికలో వెల్లడించింది.

అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే రుతుపవనాల కదలికలు చురుగ్గా సాగుతుండటంతో.. కేరళ తీరాన్ని ఇవి మే చివరి నాటికే తాకే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా దేశంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు కారణమైన ‘ఎల్ నినో’ ప్రభావం క్రమంగా బలహీనపడుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని స్థానంలో ‘లా నినా’ పరిస్థితులు ఏర్పడుతుండటంతో ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్ సహా ఉత్తరాది రాష్ట్రాలలో మే చివరి వరకు ఎండల తీవ్రత కొనసాగినప్పటికీ, జూన్ మొదటి లేదా రెండో వారంలో రుతుపవనాల రాకతో వాతావరణం పూర్తిగా చల్లబడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల గమనం ఆశాజనకంగా ఉంది. సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేకూరుస్తుంది అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు.

Also Read:పొగాకు లంగ్స్‌కే కాదు..!

కేరళ తీరంలోకి మే 28 నుండి 31 మధ్యలోనే రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. జూన్ నెలాఖరు నాటికి రుతుపవనాలు జాతీయ రాజధాని ఢిల్లీని తాకుతాయని, అప్పటివరకు అప్పుడప్పుడు పడే జల్లులు ఎండల నుండి కాస్త ఉపశమనాన్ని ఇస్తాయని అంచనా. జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాగే ఈ నాలుగు నెలల కాలంలో దేశంలో సాధారణం కంటే మెరుగైన వర్షపాతం నమోదు కానుంది.

- Advertisement -