యోగా గురు రాందేవ్ బాబాపై తీవ్రస్ధాయిలో మండిపడింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. అల్లోపతిపై రాందేవ్ వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా బ్లాక్ డేను పాటించారు. అయితే బ్లాక్ డే సందర్భంగా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు డాక్టర్లకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. రాందేవ్ దేశద్రోహిఅని వివరిస్తూ ప్రజలకు లేఖ రాసింది.
కరోనా మహమ్మారితో దేశం సతమతమవుతున్న సమయంలో ఐఎంఏ నిర్మాణాత్మక పాత్రను పోషిస్తోందని వివరించింది. భారత ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఐఎంఏ కలిసి పనిచేస్తోందని లేఖలో ప్రస్తావించింది.
కరోనా కట్టడిలో అల్లోపతి, ఆధునిక వైద్యం విఫలమయ్యాయని, వ్యాక్సిన్ తీసుకున్నా పది వేల మందికి పైగా డాక్టర్లు మరణించారని రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాందేవ్ పై దేశ ద్రోహం చట్టం కింద కఠిన చర్యలు చేపట్టాలని ఐఎంఏ డిమాండ్ చేసింది.