స్వరరాజు ఇళయరాజా పుట్టినరోజు నేడు

250
- Advertisement -

రాయినైనా కరిగించగల శక్తి ఆయన సంగీతానికి ఉంది. ఎంతటి దు:ఖంలో ఉన్నా ఆయన స్వరాలు మనసును తాకితే ఇక ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఎంతో వినసొంపైన స్వరాలను ఏరి కూర్చి పాటల మాలను కట్టిన మ్యూజిక్ మ్యాస్ట్రో పద్మభూషన్ ఇళయరాజా. మన సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో సమన్వయ పరిచి సినిమా సంగీతంలో ప్రయోగాలు చేసి, స్వరాల రహదారుల్ని నిర్మించిన సంగీత కర్త ఇళయరాజా. ఆయన పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

1943వ సంవత్సరం జూన్ 2వ తేదీన తమిళనాడులో జన్మించిన ఇళయరాజ ఒక నిరు పేదకుటుంబంలో జన్మించారు. కటిక పేదరికాన్ని అనుభవించిన ఆయన నేడు భారతదేశ సంగీత ప్రముఖ దర్శకులలో ఒకరిగా ఎదిగారు..1976లో విడుదలైన జయప్రద నటించిన ‘భద్రకాళి అనే తెలుగు చిత్రంలోని ‘చిన్ని చిన్ని కన్నయ్య” అనే పాటకు సంగీతాన్ని అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా సినీరంగ ప్రవేశం చేసారు. తెలుగులో ‘భద్రకాళి’కి తొలిసారి సంగీత దర్శకత్వం వహించినా, ఎన్టీఆర్‌ నటించిన ‘యుగంధర్‌’ మొదట విడుదలయింది.

Ilayaraja Birthday Special
దాదాపు 3 దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీ పరిశ్రమను ఏలిన సంగీత నటరాజు ఇళయరాజ.  తెలుగు, తమిళం, మలయాళం, హిందీ. కన్నడ, మరాఠీ భాషల్లో వెయ్యికి పైగా సినిమాలలో దాదాపు 5000కు పైగా పాటలకు బాణీలందించాడు. ఆయన సంగీతంవల్లే చాలా సినిమాలు విజయాన్ని సాధించాయనడంలో అతిశయోక్తి లేదు.మూడు సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకోవడమేకాక, 2004లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

ఇళయరాజా సంగీతం వింటుంటే … కొందరు సంగీత దర్శకులు చేసే బాణీల మాదిరి రణగొణ ధ్వనులు, శబ్దాల గందరగోళం ఉండవు .. లయబద్ధంగా, ప్రశాంతంగా పారే నదిచేసే సవ్వడులు వినిపిస్తాయి. పాశ్చాత్య సంగీతపు మేళవింపులున్నా ఆయన స్వరాలు సున్నితంగా, సుతి మెత్తగా ఉంటాయి. పల్లెవాసుల మనసునూ ఆవిష్కరిస్తాయి.ఇళయరాజా ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

- Advertisement -