డబ్బులు బాగా ఉన్న వారి సంగతి పక్కన పెడితే అవి లేని వారు చిన్న పాటి ఎమర్జెన్సీ అవసరం వచ్చినా ఇబ్బందులు పడతారు. డబ్బు అనేది అందరికీ అవసరమే. అది ఎవరికి ఎప్పుడు అత్యవసరం అవుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే అత్యవసర సమయంలో తెలిసిన వారి దగ్గరో, స్నేహితుల వద్దో అప్పు చేస్తారు. అది ఎందుకోసం అయినా కావచ్చు. అప్పు చేస్తేనే అవసరం తీరుతుంది. అది కూడా సరైన టైమ్‌కు అప్పు దొరికితే ఓకే.
లేదంటే ఎలా..? అంటే.. ఎవరి సంగతి ఏమో గానీ అందుకు ఫేస్‌బుక్ మాత్రం హెల్ప్ చేస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు స్నేహితుల మధ్య వారధిగా, సందేశాలను పంపుకునేందుకు ఉపయోగిపడిన ఫేస్‌బుక్ ఇకపై ఎవరికైనా ఆర్థిక అవసరాలను తీర్చనుంది. అదీ స్నేహితుల ద్వారా అప్పు తీసుకునే సౌకర్యం యూజర్లకు కల్పిస్తోంది.
చదువు, వైద్యం, పెట్ మెడికల్, విపత్తు సహాయం, వ్యక్తిగత అత్యవసరాలు, అంత్యక్రియలు, నష్టాలు, స్పోర్ట్స్, కమ్యూనిటీ వంటి కేటగిరీలను ఫండ్ రైజింగ్ కోసం ఫేస్ బుక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. నిధులు సేకరించే వారి వివరాలను యూజర్లు ఫేస్ బుక్ ద్వారా తెలుసుకోవచ్చు. మార్చిలో పర్సనల్ ఫండ్ రైజర్స్ టెస్టింగ్ ఫేస్ బుక్ ప్రారంభించింది.
అయితే facebook.com/fundraisers అనే లింక్‌ను విజిట్ చేస్తే చాలు.. ఎవరైనా ఫేస్‌బుక్‌లో డబ్బుల కోసం రిక్వెస్ట్ పెట్టవచ్చు. దీంతో సదరు యూజర్‌కు చెందిన ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ స్పందించి ఆ లింక్‌ను క్లిక్ చేసి డబ్బులు ఇస్తారు. అది డొనేషన్ లేదా అప్పు ఎలా అయినా కావచ్చు, యూజర్లు ఆ డబ్బును ఈ లింక్‌లో రిక్వెస్ట్ చేయవచ్చు. అయితే యూజర్లు తాము ముందే కొంత గోల్‌ను సెట్ చేసి ఉంచాలి. తమకు కావల్సిన మొత్తం పూర్తయినా కాకున్నా యూజర్లు తమ ఫేస్‌బుక్ స్నేహితుల ద్వారా అందిన మొత్తాన్ని బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
దీనికి కొంత ఛార్జీలు చెల్లించాలి. మొత్తంలో 6.9 శాతంతో పాటు పేమెంట్ ప్రాసెసింగ్, వెట్టింగ్, సెక్యురిటీ కోసం 30 శాతం ఇవ్వాలి. అలా చెల్లించాక మిగిలిన మొత్తం యూజర్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అయితే ఏ యూజర్ అయినా డబ్బును రిక్వెస్ట్ చేసుకోవాలంటే అది ఎందుకోసమో చెప్పాలి. అలా ఎవరైనా సంబంధిత కేటగిరీని ఎంపిక చేసుకున్నాక డబ్బును రిక్వెస్ట్ చేసి పైన చెప్పిన విధంగా దాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు..!