కర్ణాటక సీఎం సిద్దిరామయ్య ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించారు. భారతీయ జనతా పార్టీకి యోగి భారంగా మారనున్నారని సిద్దిరామయ్య అన్నారు. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు పార్టీలు ప్రచార కార్యక్రాలను హోరాహోరీగా నిర్వహిస్తున్నాయి.
ఈ నేపథ్యలోనే సిద్దిరామయ్య యోగీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే..అది బీజేపీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, కర్ణాటకలో యోగీ అడుగుపెడితే అది బీజేపీకే మైనస్ పాయింట్ గా మారుతుందని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో యోగి ఆదిత్యనాథ్ 35కు పైగా ర్యాలీల్లో పాల్గొనబోతున్నట్టు వస్తున్న వార్తలపై సిద్ధరామయ్య స్పందిస్తూ..ఏడాదిలోనే ఆయన దారుణంగా విఫలమయ్యారని, సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయిందని గుర్తుచేస్తూ..యోగి ఇక్కడకు రావాల్సిన అవసరం కానీ చేయాల్సింది కానీ ఏమీ లేదని సిద్ధరామయ్య అన్నారు.
బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పను ఓ ‘డమ్మీ’గా పోల్చుతూ..ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్‌పై తరచు తన ప్రసంగాల్లోనూ సిద్ధరామయ్య విమర్శలు గుప్పిస్తుంటారు. ‘ఉత్తరాది నుంచి దిగుమతైన వాళ్లు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగిస్తుంటారు సిద్దూ.
అయితే బీజేపీ కూడా..ఉత్తరభారతం, దక్షిణ భారతం అంటూ దేశాన్ని విడిగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ సిద్ధరామయ్యపై విమర్శలు ఎక్కుపెడుతూనే ఉంది. కాగా, ఈనెల 3న కర్ణాటకలో ఆదిత్యనాథ్ పర్యటన మొదలవుతుందని, 7 నుంచి 10వ తేదీ వరకూ పలు ర్యాలీల్లో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.