టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ తాజాగా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది ఉపశీర్షిక. ఈ మూవీ శుక్రవారం (ఆగస్ట్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను సుశాంత్ అందుకున్నాడా? లేదా? చూద్దాం.
కథ: నరసింహ యాదవ్ (వెంకట్) ఓ ఏరియాకు కార్పొరేట్. అక్కడ అతడి మాటకు తిరుగు ఉండదు. అయితే, ఆ ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయనే కారణంతో యాదవ్ స్వయంగా తన మనుషులతో కాపాలా ఏర్పాటు చేస్తాడు. యాదవ్ చెల్లి మీనాక్షి (మీనాక్షి చౌదరి) ఓ ఆర్కిటెక్ట్ సంస్థలో ఇంటర్న్ కోసం జాయిన్ అవుతుంది. అక్కడ ఆమెకు అరుణ్ (సుశాంత్)తో పరిచయం ఏర్పడుతుంది. ఎంతో జాలీగా ఉండే అరుణ్‌తో ప్రేమలో పడుతుంది. అరుణ్ కూడా ఆమెను ఇష్టపడతాడు. అరుణ్‌కు బైక్ నడపడం రాదు. దీంతో మీనాక్షి అతడికి బైక్ నడపడం నేర్పిస్తుంది. అయితే వారు తమ మనసులో మాటను ఒకరికి ఒకరు చెప్పుకోరు. మీనాక్షి తన మనసులో మాట చెప్పేందుకు లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్లాలని అరుణ్‌ను కోరుతుంది. దీంతో అరుణ్ కొత్త బైక్ కొని మీనాక్షి ఇంటికి వెళ్తాడు. అరుణ్ యాదవ్ ఏరియాలోకి వచ్చినప్పుడు అంతా అతడిని కొత్తగా చూస్తారు. దొంగతనాలు జరుగుతున్నందు వల్ల యాదవ్ మనుషులు అతడిని అడ్డుకుంటారు. మీనాక్షిని కలిసే కంగారులో నోపార్కింగ్ వద్ద తన కొత్త బైక్ పార్క్ చేస్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అరుణ్ ఆ ఏరియాలోకి వెళ్లిన తర్వాత అక్కడ ఓ హత్య జరుగుతుంది. దీంతో ఆ ఏరియాకు కొత్తగా వచ్చిన అరుణే ఆ హత్య చేసి ఉంటాడని స్థానికులు భావిస్తారు. ఆగ్రహంతో అతడి కొత్త బైకును నాశనం చేస్తారు. అప్పటికి అరుణ్.. మీనాక్షి ఇంట్లో ఉంటాడు. అయితే, ఆ హత్యలు ఎవరు చేస్తారు? యాదవ్‌కు అరుణ్ దొరికిపోతాడా? లేదా.. అనేది తెరపైనే చూడాలి.
ప్లస్ పాయింట్స్: అరుణ్ పాత్రలో సుశాంత్ అద్భుత నటనను ప్రదర్శించాడు. మీను పాత్రలో మీనాక్షి చౌదరి ఒదిగిపోయింది. తెరపై చాలా అందంగా కనిపించింది. ఓ ఏరియా కార్పొరేటర్‌గా వెంకట్ పర్వాలేదనించాడు. హీరో ప్రాణ స్నేహితుడు పులి పాత్రలో ప్రియదర్శి అద్భుత నటనను కనబర్చాడు. బైక్ షోరూం ఎంప్లాయ్‌గా వెన్నెల కిశోర్ తనదైన కామెడితో నవ్వించే ప్రయత్నం చేశాడు.అభినవ్ గోమతంతో పాటు మిగిలిన నటీ నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
మైనస్ పాయింట్స్: ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’అనే కొత్త టైటిల్ పెట్టి సినిమాపై ఆసక్తి పెంచిన దర్శకుడు దర్శన్.. కథనంలో మాత్రం కొత్తదనం లేకుండా, సాదాసీదాగా నడిపించాడు. కథలో పెద్దగా స్కోప్ లేకపోవడంతో కొన్ని అనవసరపు సీన్స్‌ని అతికించి అతి కష్టం మీద రెండున్నర గంటల పాటు సినిమాను లాగాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. అసలు సస్పెన్స్‌ని ఇంటర్వెల్ వరకు రివీల్ చేయకపోవడం సినిమాకు కాస్త ప్రతికూల అంశమే. ఇక సెకండాఫ్‌లో అయినా ఆకట్టుకునే అంశాలేమైనా ఉంటాయకునే ప్రేక్షకుడికి అక్కడా నిరాశే ఎదురవుతుంది.
సాంకేతిక విభాగం: ఈ సినిమాలో ప్రవీణ్ లక్కరాజు సంగీతం ఆకట్టుకుందని చెప్పాలి. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ గ్యారీ బి.హెచ్ చాలా చోట్ల తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి.
తీర్పు ఓవరాల్‌గా చూస్తే రొటీన్‌గా అనిపిస్తుంది
విడుదల తేదీ: 27/08/2021
రేటింగ్: 2.5/5
నటీనటులు : సుశాంత్, మీనాక్షి చౌదరి
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
నిర్మాతలు : రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల
దర్శకత్వం : ఎస్. దర్శన్