అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్ల తప్పిదాలను మరింత తగ్గించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రంట్ పుట్ నోబాల్‌ను పర్యవేక్షించే బాధ్యత థర్డ్ అంపైర్‌కు కూడా అప్పగించనుంది.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆరు నెలల పాటు పలు సిరీస్‌ల్లో ఈ నూతన పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించుకుంది.బౌలర్ బంతి వేసిన క్షణాల్లోనే ఫ్రంట్‌ఫుట్ ఇమేజ్ థర్డ్ అంపైర్‌కు కనబడుతుంది. ఒకవేళ బౌలర్ గీత దాటినట్టు కనిపిస్తే నోబాల్‌గా ప్రకటించాలని ఆన్‌ఫీల్డ్ అంపైర్‌కు చెబుతాడు. సరైన బంతే అయితే ఎలాంటి సంప్రదింపులు చేయరు. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే నోబాల్‌పై నిర్ణయం తీసుకునే హక్కును అన్‌ఫీల్డ్ అంపైర్లు కోల్పోనున్నారు.
2016లో ఇంగ్లండ్-పాక్ మధ్య జరిగిన సిరీస్‌లో దీన్ని అమలు చేసినా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా నిలిపివేశారు. తాజాగా మరోసారి ప్రయోగించాలని ఐసీసీ నిర్ణయించింది.