ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన పనామా పేపర్స్ లీక్ ఉదంతంలో బాలీవుడ్ స్టార్ల పేర్లు సంచలనం సృష్టించాయి. నల్లధనాన్ని దాచేసుకున్న నల్ల కుబేరుల జాబితాను బయటపెట్టిన బిగ్ పేపర్స్.. మన దేశంలో ఇలా డబ్బు దాచుకున్నవారు 500 మంది ఉన్నట్లు పనమా పేపర్స్ లీకేజిలో బయటపెట్టాయి. ఇందులో ప్రముఖంగా వినిపించిన పేరు బిగ్ బి అమితాబచ్చన్..
తాజాగా బిగ్‌బిపై ఆదాయపన్ను దృష్టి సారించింది. పనామా పేపర్స్‌లో ఆయనతోపాటు పేర్లున్న మరికొందరి ‘పెద్దల’ వివరాలు సేకరిస్తోంది. ఇందుకోసం ఉన్నత స్థాయి అధికారులను బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌కు పంపింది. కరేబియన్ దీవి అయిన బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ పన్ను ఎగవేతదారులకు స్వర్గధామంగా మారిన ప్రాంతాలలో ఒకటి. పనామా పేపర్స్‌లో పేర్లు బయటకి వచ్చిన 33 మందిపై ఐటీ శాఖ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. విచారణను ఆపే ప్రసక్తే లేదని, ఇతర దేశాల నుంచి ఇందుకు సంబంధించిన వివరాలను రాబడుతున్నట్టు ఓ అధికారి తెలిపారు.
అయితే బచ్చన్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను కొట్టి పడేశారు. అమితాబ్ బచ్చన్‌పై వచ్చిన ఆరోపణలపై ఐటీ అధికారులు స్పందిస్తూ.. పనామా పేపర్స్‌లో ప్రస్తావించిన సంస్థలు తనవి కావని అమితాబ్ స్పష్టం చేశారని, ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మరింత సమాచారం కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) సీనియర్ అధికారిని బ్రిటిష్ వర్జిన్‌కు పంపినట్టు తెలిపారు. అంతేకాక ఇతర దేశాల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఇదే కేసులో చిక్కుకుని నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు.