కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి మరోసారి కంటతడి పెట్టుకున్నారు. మాండ్యలో జరిగిన పార్టీ సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు రాజకీయాలు అవసరం లేదు..ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు..కేవలం ప్రజల ప్రేమ మాత్రమే కావాలన్నారు. నా కుమారుడు నిఖిల్ గౌడ మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకోలేదు. మాండ్య ప్రజలే అతన్ని పోటీ చేయాలన్నారు.
కానీ అదే ప్రజలు నిఖిల్‌కు మద్దతుగా నిలువలేదు. అది నన్ను తీవ్రంగా బాధించింది. నిఖిల్ గౌడ ఎందుకు ఓడిపోయాడో తనకు తెలియదంటూ’ కుమారస్వామి కంటతడి పెట్టుకున్నారు. జిల్లా రైతుల సంక్షేమం కోసం తాను అహర్నిశలు శ్రమించానని గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఒక్క మండ్య జిల్లాలోనే 26 కోట్ల రూపాయల మేర వడ్డీ రుణాలను మాఫీ చేయడమే తాను చేసిన తప్పా? అని ప్రశ్నించారు.
కొద్ది రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గతంలో కూడా తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని మీటింగ్ లో భావోద్వేగానికి లోనయ్యారు కుమారస్వామి.