ప్రకాష్‌ రాజ్ రాజీనామాపై మంచు విష్ణు కామెంట్స్‌..

20

టాలీవుడ్‌లో ఉత్కంఠగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం ముగిసింది. ఎన్నడూ లేని విధంగా ప్రధాన నటీనటులూ పరస్పర వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తించాయి. ఎన్నో ఆరోపణలు విమర్శల నడుమ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో గత ఆదివారం ఎన్నికలు పూర్తయ్యాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎలక్షన్స్‌లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు గెలుపొంది ‘మా’ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

మరోవైపు నటుడు ప్రకాష్‌ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇదే విషయాన్ని ఆయన ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణుకు టెలిగ్రామ్ యాప్ ద్వారా తెలియజేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని ఆమోదించాలని కోరారు. ‘మా’ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించావంటూ మంచు విష్ణును అభినందించారు. ‘మా’ను నడిపించేందుకు సకల శక్తులు ప్రాప్తించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ‘మా’లో సభ్యుడ్ని కాకపోయినా తన అవసరం ఉందనుకుంటే తప్పకుండా మద్దతు ఇస్తానని ప్రకాష్‌ రాజ్ పేర్కొన్నారు.

దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ… తనకు అభినందనలు తెలిపిన ప్రకాష్‌ రాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం తనకు అసంతృప్తి కలిగించిందని పేర్కొన్నారు.”మీరు నాకుంటే ఎంతో పెద్దవారు. ఒకే నాణేనికి బొమ్మ, బొరుసులా గెలుపోటములు ఉంటాయని మీకు తెలుసు. దీన్ని మనం ఒకేలా స్వీకరిద్దాం. దయచేసి మీరు భావోద్వేగాలకు లోను కాకండి. మీరు మా కుటుంబంలో ఒక ముఖ్య భాగం. మీ ఆలోచనలు మాకు కావాలి, మనం కలిసి పనిచేయాల్సి ఉంది. మీరు ఇప్పుడు వెంటనే నాకు బదులు ఇవ్వొద్దని కోరుతున్నాను. త్వరలో నేనే మిమ్మల్ని కలుస్తాను… అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఐ లవ్యూ అంకుల్… దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు! మనం ఎప్పటికీ ఒక్కటే!” అంటూ మంచు విష్ణు తెలిపాడు.